సాయిధరమ్ తేజ్ రీ ఎంట్రీ మూవీ ‘విరూపాక్ష’. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. శిష్యులను ఎంకరేజ్ చేస్తోన్న సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేయటమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా రాశారు. కథలో కీలకమైన మార్పులు, చేర్పులు చేశారు. అయితే సుకుమార్ చేసిన మార్పులేంటి? అనే దానిపై ‘విరూపాక్ష’ రిలీజ్ టైమ్‌లో చిత్ర యూనిట్ ఏమీ మాట్లాడలేదు.
కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తీక్.. డైరెక్టర్ సుకుమార్ తమ మూవీ ‘విరూపాక్ష’లో ఎలాంటి మార్పులు చేశారనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
‘‘నిజానికి నేను ‘విరూపాక్ష’ సినిమా కథ రాసుకున్నప్పుడు సంయుక్తా మీనన్లో గ్రే షేడ్ లేదు. నా కథ ప్రకారం యాంకర్ శ్యామల సినిమాలో విలన్. కానీ సుకుమార్‌గారు స్క్రిప్ట్‌ను మార్చారు.
ఆయన మార్పులు చేర్పులు చేసిన తర్వాత అందులో సంయుక్తా మీనన్ విలన్‌గా మారింది. ఆ విషయాన్ని చివరి వరకు రివీల్ చేయకుండా మెయిన్‌టెయిన్ చేయటం బాగా ప్లస్ అయ్యింది’’ అన్నారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘విరూపాక్ష’ బాక్సాపీస్ దగ్గర దుమ్ము దులిపింది. దాదాపు రూ.85 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది ‘విరూపాక్ష’.
ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా ప్రముఖ డిజిటల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులోనూ సినిమాకు అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ తగిన సమయం లేకపోవటంతో చివరకు తెలుగులోనూ ఏప్రిల్ 21న థియేటర్స్ రిలీజ్ చేశారు. తర్వాత తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో యాంకర్ శ్యామల, రాజీవ కనకాల, అజయ్, సాయి చంద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.