ఆమె వైసీపీకి చెందిన నేత. అధికార పార్టీ కావడంతో జిల్లాలో హడావుడి మామూలుగా ఉండదు. పైగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరక్టర్ పోస్టులో ఉన్నారు. కానీ, చేసిన పాపాలకు చివరకు కటకటాల పాలయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజని ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం.. దొంగనోట్లు మార్చడమే.
ఈమె ప్రొద్దుటూరు వైఎస్సార్ సీపీలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల పదవీకాలం ముగిసినా.. మరోసారి పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మనిషిగా ఈమెకు పేరుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గతంలో రజినిపై పలు ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని అంటుంటారు.
ఇప్పుడు నకిలీ నోట్లను చలామణీ చేస్తున్నారు. రజని నుంచి 40 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతపురంలో తమకు తెలిసిన వ్యక్తుల నుంచి ఫేక్ నోట్లను తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు ఆమెపై అభియోగాలు నమోదు చేశారు.
ఈ ఘటనపై టీడీపీ ఎటాక్ స్టార్ట్ చేసింది. నకిలీ నోట్ల చలామణీపై ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్యేని ప్రశ్నించింది. ప్రొద్దుటూరులో అప్పులు చేసి ఐపీ పెట్టిన రజనికి.. కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఎలా ఇచ్చారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. దీన్ని అంత తేలిగ్గా వదిలేయడానికి లేదని.. సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే.. నకిలీ నోట్ల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇది వాస్తవం అయితే.. ఆమెపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.