ఇండియన్ సినిమా గౌరవాన్ని ఇంటర్నేషనల్ లెవల్లో నిలబెడుతుంది ట్రిపుల్ ఆర్ మూవీ. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈసినిమా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆస్కార్ కు అడుగు దూరంలో ఉన్న ట్రిపుల్ ఆర్ ఖాతాలో రీసెంట్ గా మరో అవార్డ్ చేరింది. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో మరో అవార్డు అందుకుంది. బెస్ట్ స్టంట్స్ కేటగిరిలో ట్రిపుల్ ఆర్ ఈ అవార్డ్ ను సాధించింది.
యాక్షన్ సీక్వెన్స్ లు అంటే హాలీవుడ్ ను మించి ఎవరూ చేయలేరు. అటువంటి హాలీవుడ్ వారినే ఔరా అనిపించేలా ఆర్ఆర్ఆర్ సినిమాలో స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ ను ఆకర్షించిన వాటిలో ఇంటర్వెల్ ముందు అడవి ప్రాణులతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం.. హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకర్షించింది. ఈక్రమంలోనే చాలా మంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఇక క్లైమాక్స్ లో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ పోరాట సన్నివేశం అద్భుతం అని చెప్పాలి. ఇలా ట్రిపుల్ ఆర్ లో ఇంకొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ జ్యూరీని కూడా మెప్పించాయి.
ఇక ఈ అవార్డు అందుకున్నారు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. అవార్డ్ తీసుకున్న తరువాత ఆయన మాట్లాడారు. మా మూవీలో స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన ‘హెచ్.సి.ఎ కు థాంక్స్. నేను ముందుగా మా యాక్షన్ కొరియోగ్రాఫర్లకు థాంక్స్ చెప్పాలి. స్టంట్స్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులలో కొన్ని తీయడానికి జూజీ హెల్ప్ చేశారు. ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియా వచ్చి మా విజన్ అర్థం చేసుకుని, మా వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకుని పని చేశారు.
మా హీరోలు, వండర్ ఫుల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు థాంక్స్. రెండు మూడు షాట్స్ లో మాత్రమే బాడీ డబుల్ ఉపయోగించాం. మిగతా యాక్షన్ సీన్లు అన్నిటిలో వాళ్ళు సొంతంగా చేశారు. ఈ క్రెడిట్ అంతా మా టీమ్ కే అంటూ ఆయన మాట్లాడారు. ఇక మా ఇండియా ఎన్నో కథలకు నిలయం.. భారత దేశం నుంచి అద్భుతమైన కథలు పుడతాయి అని అంటూ.. మేరా భారత్ మహాన్ అని అన్నారు జక్కన్న.
ఇక ఈ అవార్డ్ కంటే ముందు మరెన్నో ఇంటర్నేషనల్ అవార్స్ ను సాధించింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇప్పటికే ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ రేసులో ఉంది. ఇక ఈ నాటు నాటు…పాటకు ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు.
ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. ఇవి కాకుండా మరెన్నో అవార్డ్స్ ను సాధించింది ఆర్ఆర్ఆర్ మూవీ. ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం అందరి దృష్టి ఆస్కార్ మీదనే ఉంది. ఈ అవార్డ్ సాధించి చరిత్ర తిరిగి రాయాలని చూస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్.