‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. ఈ మూవీని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఆర్ఆర్ ఆర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం విడుదలై ఏడాది అవుతున్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ గా ఎంతో ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను ఈ మూవీ దక్కించుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రస్తావించారు.
చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందనని ప్రకటించారు. ఈ మూవీకి సీక్వెల్ చేయాలని మాకు కొన్ని మంచి ఐడియాలు వచ్చాయన్నారు. అయితే బలవతంగా సీక్వెల్ తీయకూడదని అనుకున్నాం. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు మంచి ఆదరణ చూసిన తర్వాత కొన్ని వారాల క్రితం మేము మా నాన్నతో చర్చించామన్నారు.
అప్పుడే ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందన్నారు. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించినట్లు రాజమౌళి తెలిపారు. అయితే స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో ముందుకెళ్లలేమన్నారు. ప్రస్తుతం మేమంతా అదే పనిలో ఉన్నామని వెల్లడించారు రాజమౌళి.