కళాతపస్వి కే.విశ్వనాథ్ కన్ను మూసారు. సినీకళామతల్లి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి పయమయ్యారు. తన కథలతో, తన పాత్రలతో,తన తర్కంతో,తన చమత్కారంతో, తన చలన చిత్రాలతో సమాజాన్ని సంస్కరించిన ఉపాధ్యాయుడు ఆయన. కనుమరుగవుతున్న భారతీయ కళలకు పునరుజ్జీవమందించిన కళా సంజీవిని ఆయన. సినిమా అనే శక్తివంతమైన మాధ్యమాన్ని ఉపయోగించి ఉన్నత విలువల్ని జనహృదయాల్లోకి చొచ్చుకుపోయేలా చేసిన విలుకాడాయన.
దర్శకుడిగా తన తోటిదర్శకులకే కాకుండా నేటి దర్శకులకు సైతం ఆదర్శాలు నేర్పిన ఆదర్శమూర్తి. వ్యక్తిగా పరిపూర్ణజీవితాన్ని జీవించి తెలుగు సమాజానికి ఆణిముత్యాలను అందించిన దిగ్గజ దర్శకుడు.తెలుగు చిత్రసీమకు కళాఖండాలను కానుకిచ్చిన సినీశిల్పి. తన 92వ ఏట వయోభారంతో కన్నుమూశారు.
5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్..ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. కళాతపస్వి పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
అయితే గత కొద్ది కాలంగా గమనిస్తే టాలీవుడ్ను విషాదాలు వెంటాడుతున్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వరుసగా లెజెండరీ నటులను కోల్పోయింది. తమ నట ప్రతిభతో వెండి తెరని దశాబ్దాలపాటు ఏలిన దిగ్గజాలు ఒకరితరువాత ఒకరుగా వెళ్ళిపోయారు.
కొత్త ఏడాది ప్రారంభంలోనే సిల్వర్స్క్రీన్ సత్యభామ జమున మృతి చెందగా..ఫిబ్రవరి 2న దర్శకుడు సాగర్ మరణించారు. అంతకుముందు వరసుగా కృష్ణ, కృష్ణంరాజు ఇలా ఇంకొంతమంది దిగ్గజాలు కన్నుమూశారు. ఓసారి వారిని స్మరించుకుందాం.
ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83).. గతేడాది సెప్టెంబరులో తుదిశ్వాస విడిచారు. తన ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 180 పైగా సినిమాల్లో నటించారు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద కథల్లో కూడా నటించి కృష్ణంరాజు తన విశిష్టతని చాటుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు దీటుగా తనదైన నటనతో రాణించారు.
విప్లవవీరుడు, మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా నటించి యావత్ తెలుగుప్రేక్షకుల్ని మెప్పించారు సూపర్ స్టార్ కృష్ణ. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఈయన గతేడాది నవంబరులో కన్నుమూశారు.
పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన విశిష్ట నటుడు కైకాల. తేడాది డిసెంబరులో తుదిశ్వాస విడిచారు మొత్తంగా 870కి పైగా సినిమాలు చేశారు.
ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా 1500కి పైగా సినిమాల్లో నటించారు చలపతిరావు. ఆయన.. బాలకృష్ణ సహా పలువురు కథానాయకులతో సినిమాలు కూడా నిర్మించారు గుండెపోటుతో గతేడాది తుదిశ్వాస విడిచారు..
వయోభారంతో అలనాటి సినీనటి, వెండితెర సత్యభామ జమున (86) ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు. 16 ఏళ్ళ వయసులో 1953లో పుట్టిల్లు మూవీతో వెండి తెరపై అడుగు పెట్టిన ఆమెకు మిస్సమ్మ సినిమా పేరు తెచ్చింది.
సీనియర్ దర్శకుడు సాగర్ (70) ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ 2023న కన్నుమూశారు. కెరీర్లో దాదాపు 40కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇక ఒక్కరోజు వ్యవధిలోని దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ కూడా కన్నుమూశారు.