సంగారెడ్డి జిల్లాలో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యం కలకలాన్ని రేపుతోంది. పటాన్ చెరు మండలం రుద్రారం గీతం యూనివర్శిటీలో బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న రోషిని అదృశ్యమైంది.
దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సంక్రాంతి సెలవులు కావడంతో.. ఈనెల 13 వ తేదీన సంక్రాంతి సెలవుల కోసం బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ యూనివర్శిటీ నుంచి వెళ్లిపోయింది రోషిని. అయితే అదే రోజు ఆమె వాళ్ల బాబాయి ఇంటికి చేరుకుంది. 13 తేదీ నుంచి 16 వ తేదీ ఉదయం వరకు బాబాయి ఇంటి దగ్గరే ఉంది.
అయితే 16 తేదీన మధ్యాహ్నం ఆమె బాబాయి ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరింది. ఇక ఇక్కడే మిస్టరీ నెలకొంది. 16 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఆమె ఎక్కడ ఉందనేది కార్లిటీ మిస్ అవుతుంది. ఇక ఈ క్రమంలో ఆమె 22 వ తేదీన టాంజానియాలో ఉన్న తన తండ్రి రాముకు ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు..యూనివర్శిటీకి ఫోన్ చేయగా.. 22 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులున్నాయని తెలిపారు.
మళ్లీ రోషినికి ఫోన్ చేస్తే .. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీని పై వాళ్లు పటాన్ చెరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని అదృశ్యంపై దర్యాప్తు మొదలుపెట్టారు.అయితే 16వ తేదీన బాబాయి ఇంటి నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని 22 వ తేదీ వరకు ఎక్కడ ఉందనేది మిస్టరీగా మారింది. ఆ తరువాత ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి ఫోన్ చేయాల్సినంత కష్టం ఏమోచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.