నష్టాల భర్తీకి అధికారులు కొత్త ఎత్తులు
తెలంగాణా పల్లెల్లో కరెంట్ ఛార్జీల రచ్చ
ప్రజలపై అదనపు భారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ విషయం అందరికీ తెలుసు. ఐతే, వాటిని గట్టెక్కించాల్సిన అధికారులు అతితెలివిగా వ్యవహరిస్తూ భారాన్ని ప్రజలపై నెట్టేస్తున్నారు. నష్టాలను భర్తీ చేసుకోవడానికి వారిప్పుడు కొత్త తరహా మోసాలు మొదలుపెట్టారు.
సాధారణంగా డిస్కమ్‌లు నష్టాల్లో ఉంటే అధికారికంగా విద్యుత్ ఛార్జీలు పెంచి వాటిని భర్తీ చేసుకోవాలి. అదొక మార్గం. ఐతే, దాని వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం. పోనీ, విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించి ఆదుకుంటుందా అంటే అదీ జరగదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి విద్యుత్ డిస్కమ్‌లను ఆదుకోవడం అనేది ఇప్పుడు అసలు సాధ్యం కానే కాదు. అందుకే ప్రజలకు తెలియకుండానే వారి జేబులను ఖాళీచేసే పద్ధతులకు పాల్పడుతున్నారు. ప్రజల నుంచి ఏదో పద్దతిలో అధిక మొత్తాలు వసూలు చేసి విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించుకోవాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. ఛార్జీలు పెంచి ప్రభుత్వానికి నష్టం కలిగించకుండా ప్రజల నుంచి వేరే మార్గాలలో వసూలు చేసుకోవాలని అధికారులపై వత్తిడి తెస్తున్నారు. దాంతో రకరకాలుగా ఆలోచించి విద్యుత్ అధికారులు ఒక మాస్టర్ ప్లాన్ అమలుచేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త తరహా మోసాలకు తెరతీశారు.
ఈ మోసం ఎలా జరుగుతోందో ఒకసారి చూద్దాం….
ప్రతి ఒక్కరు 100 యూనిట్ల విద్యుత్ వాడితే వాళ్లకు యూనిట్ కు 3.60 రూపాయలు వసూలు చేయాలి. అదే 100 యూనిట్లు దాటితే మొదటి యూనిట్ నుంచి 6.90 రూపాయలు వసూలు చేస్తారు. దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన ఇళ్లల్లో నెలకు విద్యుత్ వాడకం 100 యూనిట్లు దాటవు.
విద్యుత్ శాఖ ఉద్యోగులు 30 రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుంచి 40 రోజుల వరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్‌కి 3.60 రూపాయలు (ఒక్కొక్క యూనిట్ ధర)… రెండు రోజులు ఆలస్యం చేయడం వల్ల ఆ రెండు రోజులలో వాడకం 6 యూనిట్లతో కలిపితే మొత్తం 106 యూనిట్లు వస్తుంది. అప్పుడు స్లాబ్ 101 యూనిట్లు దాటుతుంది కాబట్టి అప్పుడు యూనిట్ ఒక్కింటికీ ధర 6.90 రూపాయలు. అంటే, విద్యుత్ అధికారుల నిర్వాకం వల్ల నెల రోజులకు మించిన కాలానికి కూడా వినియోగదారుడు బిల్లు కట్టాల్సివస్తోంది. ఆ మేరకు అతని శ్లాబ్ రేట్ మారి అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ఒక లెక్క ప్రకారం ఈ దోపిడి విధానం వల్ల వినియోగదారుడిపై ఆదనంగా పడుతున్నభారం మూడొందల రూపాయిలకు మించి వుంటోంది. ఎఈలు, డీఈలు, ఎస్‌ఈల స్థాయిలో వస్తున్న ఒత్తిళ్ల వల్లే ఇలా చేయాల్సివస్తోందని మీటర్ రీడింగ్ తీసుకునే ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తం మీద పైనుంచి వస్తున్న ఆదేశాల వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ఎక్కువ మొత్తాలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణా గ్రామాలలో గోలగోలగా ఉంది. ప్రజలు ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతున్నారు.