తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలు రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. దాదాపు మూడు నెలలుగా ఇరు రాష్ట్రాల అధికారులు భేటీ కావడం.. బస్సులు నడపడంపై ఏదీ తేల్చకపోవడం సర్వసాధారణంగా మారింది. ఈక్రమంలోనే మరోసారి నేడు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమవుతున్నారు.
గత సమావేశంలో రెండు రాష్ట్రాల బస్సులు సమాన దూరం నడుపుకుందామన్న తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించలేదు. దీంతో బస్సుల ప్రారంభంపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతోంటే.. టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీ పరిధిలో 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. ఇందులో తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటే…. తెలంగాణ 50వేల కిలోమీటర్ల పరిధి పెంచుకుంటే సరిపోతుందని ఏపీ ప్రతిపాదించింది. కానీ తెలంగాణ ఇందుకు ఒప్పుకోలేదు. గతంలో నడిపినట్టుగానే సర్వీసులు నడిపిస్తామని స్పష్టం చేయడంతో.. గత సమావేశంలో బస్సుల ప్రారంభంపై స్పష్టత రాలేదు. కనీసం ఈసారైనా చర్చలు కొలిక్కి వచ్చి బస్సులు నడుస్తాయో లేదో చూడాలి.