తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గురువారం నాటి సభలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ధరణి పోర్టల్ విషయంలో వీరిద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది. కాంగ్రెస్ సభ్యుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారుతోందని అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతులు గందరగోళంలో ఉన్నారని అన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తేల్చి చెప్పారు.
ఆ వెంటనే శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ధరణి పోర్టల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సమస్యలను ఎత్తి చూపాలని చెప్పారు. అందులో లోపాలు ఉంటే సరి చేస్తామని చెప్పారు. అంతేకానీ.. ధరణి పోర్టల్ మొత్తాన్ని తొలగించబోమని తేల్చి చెప్పారు. ధరణిని రద్దు చేయడం, ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చివేయాలని అనడం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు.
ధరణి పోర్టల్ వల్ల సంతోషంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. అన్నిసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు.
‘‘ధరణిని ఎత్తివేయడం మీ ఉద్దేశమా? ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా? ఇంత అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడొచ్చా? అధ్యక్షుడి మాటలను సమర్థిస్తూ వారి సభ్యురాలు ఇలా మాట్లాడొచ్చా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుంది. ఇకనైన మీరు మీ వైఖరి మార్చుకోవాలి’’ అని కేటీఆర్ గట్టిగా చెప్పారు.