డ్రైవింగ్ లైసెన్స్.. చాన్నాళ్లుగా టాలీవుడ్ లో నలుగుతున్న మలయాళీ సినిమా ఇది. మల్లూవుడ్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. సినిమా చూసిన వెంటనే, తన కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను భారీ రేటుకు కొనేశాడు చరణ్.
అప్పట్నుంచి ఈ సినిమా తెలుగు రీమేక్ పై దశలవారీగా కథనాలు వస్తూనే ఉన్నాయి. రామ్ చరణ్, వెంకటేష్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ వస్తుందని కొందరు.. ప్రాజెక్టులోకి రవితేజ చేరాడంటూ మరికొందరు.. సాయితేజ్, వెంకటేష్ తో ఈ సినిమా రాబోతోందని ఇంకొందరు.. ఇలా రకరకాల స్టోరీలు అల్లేశారు.
ఓవైపు టాలీవుడ్ లో ఇదిలా గాసిప్ స్టేజ్ లో ఉంటుండగానే, అటు బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ ప్రకటన వచ్చేసింది. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హస్మి హీరోలుగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. సినిమాకు సెల్ఫీ అనే టైటిల్ పెట్టారు. ప్రమోషనల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.
సెల్ఫీ సినిమాను ఎనౌన్స్ చేయడంతో, ఇటు టాలీవుడ్ లో డ్రైవింగ్ లైసెన్స్ టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. తెలుగులో ఈ రీమేక్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు పోటెత్తుతున్నాయి.