– గల్ఫ్ ఆయిల్ భూముల్లో అక్రమంగా అనుమతులు
– హైకోర్టు బ్రేక్ తో 2,800 కోట్ల ప్రాజెక్ట్ పై నీలినీడలు
– అసైన్డ్ దారుల భూములపై రియల్ ఎస్టేట్ కన్ను
– మొదటి నుంచి చెబుతున్నా పట్టింపులేదు!
క్రైంబ్యూరో, తొలివెలుగు:కూకట్ పల్లిలో ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కోసం 950 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. అందులో 540 ఎకరాలు ఉదాసీన్ మఠం భూములను లీజుకు తీసుకుంది. అయితే.. మిగితా భూములను అప్పటి అసైన్డ్ దారుల నుంచి తీసుకుని ఇండస్ట్రియల్ కి ఇచ్చింది సర్కార్. కానీ, ఇప్పుడా ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేలా నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది.
వాటిలో 42 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. 28 ఎకరాల్లో హానర్ హోమ్స్ సంస్థ అల్లు అర్జున్ ని ప్రచారకర్తగా పెట్టి విల్లాలను అమ్ముతోంది. ఒక్కో విల్లా 20 కోట్ల వరకు రేట్ పెట్టింది. వీవీఐపీలు ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే.. అసైన్డ్ వారసులు ఆ భూమి తమకే చెందుతుందని హైకోర్టును అశ్రయించారు. రిట్ అప్పీల్ నెంబర్ 643 ఆఫ్ 2022.
34 ఎకరాల 17 గుంటలకు స్టేటస్ కో మెయింటెన్ చేయాలని చీఫ్ జస్టిస్ తో కూడిన డివిజన్ బెంచ్ సెప్టెంబర్ లో తీర్పునిచ్చింది. కానీ, ఇంకా పనులు జరుగుతున్నాయి. దీంతో కోర్టు ధిక్కరణ కేసుగా వెళ్లారు. కంటెప్ట్ కేసు నెంబర్ 1651/2022. దీంతో పది మందికి నోటీసులు జారీ చేసి కేసు వాయిదా వేసింది న్యాయస్థానం. తాత్కాలికంగా పనులకు బ్రేకులు పడ్డాయి.