పది రోజుల్లోగా పీఆర్సీపై ప్రకటన ఉంటుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. పీఆర్సీ ఒక్కటే తమ డిమాండ్ కాదని ఇతర అంశాలు కూడా ఉన్నాయని తెలిపాయి. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.
అమరావతిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగగా.. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే అధికారులు మాత్రం నివేదికలో ఉన్న సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నివేదిక ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
ఇప్పటికే తిరుపతిలో పీఆర్సీపై సీఎం ప్రకటన చేశారని గుర్తు చేశారు అధికారులు. సీఎం ఇచ్చిన హామీతో పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని కార్యదర్శులు ప్రకటించగా.. నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.