టీపీసీసీ కొత్త చీఫ్ నియామక ప్రక్రియ వేగమందుకుంది. ఈ మేరకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఇందుకు సంబంధించిన బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు అప్పగించింది.
మణికం ఠాగూర్ తొలుత కోర్ కమిటీ అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత పార్టీకి చెందిన వివిధ విభాగాల నేతలు, శ్రేణులతో భేటీ అవుతారు. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఇన్‌ఛార్జీలు, పీసీసీ కమిటీ సహా ఇతర నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఆతర్వాత శనివారం ఢిల్లీ వెళ్లి.. కొత్త పీసీసీపై రాష్ట్ర పార్టీ అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానానికి మణికం ఠాగూర్ నివేదిస్తారు.
కొత్త ఏడాదిలోగా ఎలాగైనా కొత్త అధ్యక్షుడిని ప్రకటించి.. తెలంగాణలో పార్టీ దూకుడు పెంచాలని కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా నేతలు చెబుతున్నారు.