లడఖ్ సరిహద్దుల్లో భారత-చైనా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇప్పటివరకు తూర్పు లడఖ్ లోని గోగ్రా- హాట్ స్ప్రింగ్ వద్ద ఉభయదేశాల సైనికులూ దాదాపు తలపడేంత స్థితిలో ఉంటూ వచ్చారు. ఘర్షణ వాతావరణం ఏర్పడేంత పరిస్థితి ఉంటూ వచ్చింది. అయితే రెండు దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో సుమారు 16 దఫాలుగా జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయని విదేశాంగ శాఖ తెలిపింది. వాస్తవాధీన రేఖ పొడవునా పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఈ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి వెల్లడించారు.
ఈ నెల 12 కల్లా ఉపసంహరణ పూర్తి కాగలదని భావిస్తున్నామన్నారు. తాము తాత్కాలికంగా నిర్మించిన ఇళ్ళు, టెంట్లను తొలగించేందుకు చైనా అంగీకరించిందని తెలిపారు. షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ ఉజ్బెకిస్తాన్ ని విజిట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాంగాంగ్ టీ సో, పీపీ, 14, పీపీ, 15, పీపీ 17 పాయింట్ల వద్ద ఈ నెల 8 నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది.
గత జులై 17 న ఉభయ దేశాల కమాండర్ల మధ్య 16 వ దఫా చర్చలు జరిగాయి. ఇదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ దిశగా చర్చలను కొనసాగించాలని తీర్మానించారు. ఉజ్బెకిస్తాన్ లో ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కి మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు.
ఆ నేపథ్యంలోనే లడఖ్ బోర్డర్లో రెండు దేశాల బలగాలూ వెనక్కి మరలాలని నిర్ణయించారు. ఉజ్బెకిస్తాన్ సదస్సు సందర్భంగా మోడీ, జీ జిన్ పింగ్ ముఖాముఖి సమావేశమయ్యే సూచనలున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే భారత-చైనా బలగాలు వెనక్కి మరలుతున్నంత మాత్రాన అన్నీ సవ్యంగా ముగిశాయని చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. చైనా మళ్ళీ వచ్చి పడినా పడవచ్చునన్నది వారి ఆందోళన. బోర్డర్లో ఎప్పుడూ దాదాపు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్నది వారి అంచనా.