హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ ”దిశ” దారుణ హత్యపై దర్యాప్తు మొదలైంది. సంఘటనపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పర్యవేక్షణలో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో మొత్తం ఏడు బృందాలు దర్యాప్తులో పాల్గొంటున్నాయి. ఒక్కో బృందంలో ఏడుగురు చొప్పున పోలీసులున్నారు. సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్,డి.ఎన్.ఎ పరిశీలన,లీగల్ ప్రొసీడింగ్స్, సీసీ కెమెరా పుటేజ్ పరిశీలన, టెక్నికల్ ఎవిడెన్స్ అనాలిసిస్ ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ ఏర్పాటైన వెంటనే చర్లపల్లి జైలు నుంచి అర్ధరాత్రి నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ పోలీసులు నేరుగా తొండుపల్లి, చటాన్ పల్లి ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. నిందితుల చెప్పిన ప్రకారం తొండుపల్లి గేటు నుంచి అర కిలో మీటర్ దూరంలో పాతిపెట్టిన దిశ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జైలుకు తీసుకొచ్చి విచారించారు. భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను చర్లపల్లి జైల్లోనే ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ ఏడు రోజుల్లో నిందితుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, ఫోరెన్సిక్, టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చాక నెల రోజుల్లోపే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలని భావిస్తోంది.