తల్లి తండ్రి లేరు… నా అన్న వాళ్ళు ఎవరూ లేరు… సొంత ఊరు వాడినే ప్రేమించింది. నమ్మింది… తల ఒంచి తాళి కట్టించుకుంది. నమ్మి ఏడు అడుగులు ధైర్యంగా వేసింది… నేడు అనాధగా… గర్భిణిగా మిగిలిపోయింది. ఆ కనపడని వ్యధ… ఆ ఆవేదన సమాజం ఇప్పుడు వినదు. ఆ పాపంలో నీకు కూడా భాగం ఉంటుంది అన్నట్టు నిందలు వేస్తుంది. 20 ఏళ్ళు కూడా రాకుండా సమాజంలో వితంతువు హోదా పొందింది. అత్తా మామల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం… ఇప్పుడు తనను ఆదరించే వాడు గాని చేర దీసే వాడు గాని ఎవరూ లేరు.
దిశ హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య పరిస్థితి ఇది. నా భర్తను ఎలా చంపారో నన్ను కూడా అలాగే చంపేయండి… నేను నా భర్త లేకుండా బతకలేను అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి మరీ దయనీయం… భర్త చేసిన పనికి… ఆమెను కూడా సమాజం దోషిగా చూస్తుంది. భర్త చేసిన నేరానికి తనది కూడా పాపం అంటుంది సమాజం. ప్రభుత్వాలు సాయం చేయవు… దిశ కి న్యాయం చేసాం అని చెప్పుకునే పోలీసులు ఆమెకు అండగా నిలబడే పరిస్థితి అంతకన్నా లేదు.