దిశ హత్యాచార నిందితులకు మరిన్ని హత్యాచారాలతో సంబంధాలున్నాయా…? ఇప్పుడా పాత కేసులను కూడా పోలీసులు తొవ్వుతున్నారా…? షాద్ నగర్ కోర్టులో పోలీసులు వేయబోయే చార్జ్‌షీట్‌లో ఈ అంశాలన్నీ పొందుపర్చబోతున్నారా…? అంటే అవుననే అంటున్నాయి పోలీస్ శాఖ వర్గాలు.
దిశ నిందితులు మద్యం మత్తులో హత్యాచారం చేశారని ప్రచారం ఉన్న నేపథ్యంలో… ఆ నలుగురిలో ఇద్దరు కరుడు గట్టిన నిందితులని పోలీసులు సాక్షాధారాలు సేకరిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులు, మహబూబ్‌నగర్ చుట్టుపక్కల జరిగిన దాదాపు 15 హత్యాచార కేసుల్లో వీరి పాత్ర ఎంతవరకు ఉంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కాకముందే వారికి దిశ హత్యాచారం జరిగిన విధంగానే మరో 15 కేసులు ట్రేస్ అవుట్ కాకుండా ఉన్నాయి. దీంతో వారి డీఎన్‌ఏ రిపోర్టుతో వీరి డీఎన్‌ఏ రిపోర్ట్‌ను పోల్చి చూస్తున్నారు పోలీసులు. అయితే… ఆ 15 కేసుల్లో 6 కేసుల్లో ఆరిఫ్, 3 కేసుల్లో చెన్నకేశవులు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
అయితే, ఫేక్ ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులు చేసిన పనికి… ఎప్పటి నుండి నిర్దారణ కానీ కేసులన్నింటిలో ఆ నలుగరు నిందితులను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని, తద్వారా పోలీసులు మంచే చేశారు అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించేలా పోలీసులు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలకు వీరు పాల్పడింది నిజమే అయితే… ఇన్నాళ్లు పోలీసులు ఏం చేశారని, అప్పుడే అరెస్ట్ చేసి ఉంటే దిశకు ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.