“బట్టతల” మగవారి అందాన్ని క్షవరం చేయడానికి సంక్రమించే ఒకానొక అనువంశిక అవలక్షణం. చెప్పాపెట్టకుండా ఒక్కొక్క వెంట్రుక ఊడిపోతుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఆ బాధని ఎవ్వరితో చెప్పుకోవాలో తెలియదు.
వాళ్ళు పడే మనోవేదన ఉన్నదిఉన్నట్టుగా చూపించే అద్దానికి..నీకు నేను అవసరమా..! అంటూ వెక్కిరించే దువ్వెనకే తెలుసు. బట్టతల కారణంగా చాలా మంది మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం కష్టతరమవుతోంది.
అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు శతాబ్దాలుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. విగ్గులు, బిట్స్ తప్ప వారి కన్నీరు తుడిచే ఖచ్చితమైన పరిష్కారం ఇంతవరకూ రాలేదనే చెప్పాలి.
అయితే బట్టతల ఉన్నవారు భాగ్యవంతులు అని ఓ సామెత ఉంది. అది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ.. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో మాత్రం నిజంగా నిజమయ్యింది.అదేంటో చూద్దాం.
బట్టతల ఉందన్న కారణంతో ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించాడు అతడి బాస్. ఆ వ్యక్తి తనకు జరిగిన అవమానానికి, అన్యాయానికి ముక్కుపిండి నష్టపరిహారం వసూలు చేశాడు..!
ఇంగ్లాండ్‌కు చెందిన 61 ఏళ్ల మార్క్ జోన్స్.. లీడ్స్‌లోని టాంగో నెట్‌వర్క్ అనే మొబైల్ ఫోన్ల సంస్థలో సేల్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే బట్టతల ఉందన్న కారణంతో.. ఇటీవల జోన్స్ బాస్ ఫిలిప్ హెస్కెట్ అతడిని విధుల నుంచి తొలగించాడు.
దీంతో జోన్స్ కోర్టును ఆశ్రయించారు. సదరు మొబైల్ తయారీ కంపెనీపై దావా వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన స్థానిక న్యాయస్థానం.. జోన్స్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. టాంగో నెట్‌వర్క్..వివక్షపూరితంగా విధుల నుంచి తొలగించిందని గుర్తించిన న్యాయస్థానం..
అతడికి 71వేల పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 71లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది. దీంతో ఆ మొత్తాన్ని కంపెనీ అతడికి చెల్లించింది. అయితే.. జోన్స్‌ను తొలగించిన ఆ బాస్ ఫిలిప్‌కు కూడా బట్టతల ఉండటం కొసమెరుపు..