కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు బ్యాంకులో చెక్కులు మార్చుకోవడానికి వెళ్తే చిక్కదురైంది. వారికి కాలం చెల్లిన చెక్కులను పంపిణీ చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులతో చెప్పగా వారు నిరాశకు గురయ్యారు.
పూర్తి వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలో 19 మంది లబ్దిదారులకు 19,02,204 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దివాకర్ రావు ఇటీవలే పంపిణీ చేశారు. అనంతరం చెక్కులను డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు తీసుకెళ్లిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది.
చెక్కు పైన వేసిన తేదీ మూడు నెలల సమయం దాటిందని, చెక్కులు చెల్లవని బ్యాంకు సిబ్బంది రిటర్న్ చేశారు. 06.07.2022 డేట్ తో ఇచ్చిన 19 చెక్కులు ఈ నెల 6 వ తేదితోనే చెక్కు వ్యాలిడిటీ ముగిసిపోయింది.
ఎమ్మెల్యే దివాకర్ రావు సమయం ఇవ్వకపోవడం వలనే చెక్కులు పంపిణీ చేయలేదని, ఇందులో మా తప్పేం లేదని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఈ 19 చెక్కులను వెనక్కి తీసుకుని వేరే చెక్కులు ఇచ్చే పనిలో అధికారులున్నట్లు తెలుస్తోంది.