– ఆందోళనలో ఎర్ర పార్టీలు
– అనుకున్నదొక్కటి.. అవుతోంది మరొకటి?
– సీట్ల విషయంలో మొదలైన కిరికిరి!
– పొత్తు టెన్షన్ లో గులాబీలు
– కామ్రేడ్స్ కు సీట్లు.. ఇప్పిస్తారా? లేదా?
అటు ఎన్నిగల నగారా మోగడానికి సిద్ధమవుతుంటే.. ఇటు లెఫ్ట్ వెళ్లాలా.. లేక రైట్ వెళ్లాలా.. అన్న సందిగ్ధత ఎప్పుడూ కామ్రేడ్లను వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ సారి కూడా సేమ్ సిఛ్వేషన్..బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో ఎర్రపార్టీ కన్ఫ్యూజన్ లో పడిందట. కారు పార్టీ కూడా లెప్ట్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుందా అన్న చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో జోరందుకుంది.
అయితే వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మునుగోడు బైఎలక్షన్ తర్వాత చర్చ ఊపందుకుంది. ఉభయ పక్షాల నుంచి ఈ దిశగా ప్రకటనలు వచ్చాయి. మాటలు కలిశాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్,లెప్ట్ పార్టీలు కలిసి పనిచేస్తాయా.. అని ఆరా తీస్తున్నారు. తాజాగా వామపక్ష శిబిరాల నుంచి వస్తున్న స్టేట్మెంట్లతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పొత్తులో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని ఇన్నాళ్లూ సీపీఐ,సీపీఎం వర్గాల్లో చర్చ నడిచింది.
కామ్రేడ్లు ఎక్కడ తమ సీట్లకు ఎసరు పెడతారో అని గులాబీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందేవారు. అయితే బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరుపై కమ్యూనిస్టులు అసంతృప్తితో ఉన్నారట. లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉంటుంది కానీ.. సీట్లు ఇవ్వబోరని ఆడపాదడపా మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికలు..పొత్తు గురించి చర్చ రాకముందే.. మంత్రులు అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారని కామ్రేడ్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా తమను దెబ్బతీసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అని సీపీఎం,సీపీఎం నేతలు సందేహిస్తున్నారట. సీపీఎం అయితే ఓ అడుగు ముందుకేసి.. మంత్రులను కట్టడి చేయాలని బీఆర్ ఎస్ ను కోరింది.
ఉభయ కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పట్టు ఉంది. గెలిచే నియోజక వర్గాలు ఎక్కవ లేకపోయినా.. గెలవడానికి సరిపడా మద్దతు ఇచ్చే పరిస్థితలో ఉన్నామనేది లెఫ్ట్ నేతల భావన. ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో లెప్ట్ పార్టీల మద్దతుతోనే గులాబీ పార్టీ బయటపడిందనేది కమ్యూనిస్ట్ నాయకుల వాదన. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ లు తలా రెండు, మూడు నియోజక వర్గాలోల పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాయి.
అయితే లెఫ్ట్ అడిగే సీట్స్ ఇవ్వడానికి అధికార పార్టీ అనుకూలంగా లేదనే ప్రచారం జరుగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేస్తారని లీకులు వచ్చాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో పోటీ చేస్తారని చర్చ సాగింది. వీటికి తోడు సీపీఎం మిర్యాలగూడ కోరుకుంటోంది. సీపీఎం మునుగోడు, దేవరకొండ, హుస్నాబాద్ లలో పోటీ చేయాలని అనుకుంటోంది. అధికార పార్టీ మాత్రం ఎన్నికల్లో లెఫ్ట్ తో కలిసి పనిచేయడమే తప్పితే సీట్లు ఇవ్వబోరనే చర్చ మొదలుకావడంతో కమ్యూనిస్టులు కలవర పడుతున్నారు.
ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా అధికారపార్టీ మరో ప్రత్యామ్నాయం చూపిస్తుందని అనుకుంటున్నారు. అయితే పొత్తులో భాగంగా తమకు సీట్లు ఇస్తే అది అధికార పార్టీకే లాభమని..లేదంటే ఇబ్బందులు తప్పవనే సంకేతాలు పంపే ఆలోచనలో కామ్రేడ్లు ఉన్నారట. పరస్పరం సహకారం లేకపోతే పొత్తులు ఎలా పొడుస్తాయనేది వాళ్ల ప్రశ్న.