ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై మధ్య సత్సంబంధాలు లేవా? కేసీఆర్ తీరు పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేసీఆర్ కేబినెట్ పంపిన ఫైల్‌ను ఇంకా గవర్నర్ ఆమోదించకపోవడమే ఇందుకు సాక్ష్యమని అభిప్రాయపడుతున్నారు.
కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నామినేట్ చేస్తూ కేబినెట్ ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికీ ఆ ఫైల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో అయితే రెండు రోజుల్లోనే గవర్నర్ సంతకం, నోటిఫికేషన్ జారీ కూడా జరిగిపోయేదన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటిది 12 రోజులైనా ఆ ఫైల్ అక్కడే ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియామకం పట్ల సంతృప్తిగా గవర్నర్ తమిళిసై లేరని తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తోసిపుచ్చడానికి లేదు. కానీ ఆమోదించేందుకు ఆమె కావాల్సినంత సమయం తీసుకునేందుకు అవకాశం ఉంది. కేసీఆర్ తీరు బాగా లేదని చెప్పడానికి ఆమె ఒకరకంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని, కౌశిక్ రెడ్డి ప్రతిపాదనను ఆమోదించడానికి ఆలస్యం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్.. నెలలో కనీసం రెండు, మూడు సార్లయినా రాజ్ భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసేవారు. కానీ తమిళిసై వచ్చాక ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. అసెంబ్లీ సమావేశాలు , స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ వంటి అధికారిక కార్యక్రమాల కోసం మినహా ఆయన రాజ్‌భవన్ వైపు వెళ్లడం లేదు.