ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు పండుగ పూట పస్తులుంటుండగా, ఇప్పుడు సింగరేణి కార్మికులకు కూడా పండగ లేనట్లే. ఏళ్ల తరబడి ఉన్న విధానాన్ని మార్చటమే ఇందుకు కారణంగా కనపడుతోంది.
50వేల మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు… దసరా పండుగ జరుపు కోలేదు. చేసిన పనికి జీతం ఇయ్యక, సెల్ఫ్ డిస్మిస్ ప్రకటనతో కార్మిక కుటుంబాలు పుట్టెడు దుఖంలో ఉన్నాయి. దీపావళి వచ్చే సరికి ఆ బాధ సింగరేణి కార్మికులకూ తప్పేలా కనపడటం లేదు. 30 సంవత్సరాల నుండి సింగరేణి కార్మికులకు ప్రతి దీపావళి ముందు బోనస్ ఇవ్వటం అనవాయితీ. కానీ ఈసారి నష్టాల పేరిట సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది యాజమాన్యం.
సింగరేణిలోనూ… దాదాపుగా 50వేల వరకు కార్మికులుంటారు. అంటే ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సంఖ్య దాదాపు సరిసమానం. అంటే కీలకమైన రెండు సంస్థలు ఓ సంస్థ దసరాకు పస్తులుంచితే, మరో సంస్థ దీపావళికి పస్తులుండేలా చేస్తోంది. ఇది ప్రభుత్వాలకు మంచిది కాదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం విద్యుత్ సంస్థల నుండి 7వేల కోట్ల బకాయిలున్నాయి. అందుకే సంస్థ నష్టాల్లో ఉంది… బోనస్ ఇవ్వడానికి 300కోట్ల వరకు అవసరం కావాలని వాదిస్తోంది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి, కార్మికుల సంతోషాన్ని కోరుకునే ప్రభుత్వమే అయితే… విద్యుత్ సంస్థల బకాయిలను చెల్లించేలా చూసి… కనీసం తమకు బోనస్ వచ్చేందుకు సహకరించేది, కానీ ప్రభుత్వం కార్మికుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.