ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ అధికారం. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి చేస్తూ వస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలు గులాబీ నాయకులకు సవాళ్లు విసరడమే ఇన్నాళ్లుగా జరుగుతోంది. అయితే.. తాజాగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పంచాయితీ మొదలైంది. బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నారని.. కేసీఆర్ డైరక్షన్ లోనే పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ స్పందించారు. “రేవంత్.. నువ్వు చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ముందా? నీకు నిజంగా నిజాయితీ ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జోగులాంబ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తావా? నువ్వు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని మేం నిరూపిస్తాం.. బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి జోగులాంబ సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధం. మీరు సిద్ధమా?” అని సవాల్ విసిరారు.
గద్వాలలోని తన నివాసంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. బండి చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని చెప్పారు. యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. “కేటీఆర్ వాడుతున్న భాష జుగుప్పాకరంగా ఉంది.. ఎడమ కాలి చెప్పుతో పదవిని తన్నేస్తానని చెబుతున్నారు.. ఆ పదవి కోసమే కదా అడ్డమైన గడ్డి తింటోంది. వేలాది కోట్లు దోచుకుని ఓట్లను కొనాలనుకుంటున్నది ఎందుకు? బీజేపీకి భయపడే టీఆర్ఎస్ పీకే ను తెచ్చుకుంది. ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మడం లేదని గ్రహించి… కొత్త మోసాలు ఏం చేయాలనే విషయంపై చర్చించడనికే పీకేను పిలిపించుకున్నారు” అని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీని గెలిపించడానికి సిద్దమయ్యారని అన్నారు డీకే అరుణ. అందుకే.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ తో కుమ్కక్కై పీకేతో మంతనాలు చేస్తోందని ఆరోపించారు. “రేవంత్ కు ఇంకా విశ్వాసమున్నట్లుంది కాంగ్రెస్ పైన… టీఆర్ఎస్ తో పీకేకు పొత్తు ఉండదని అంటున్నడు. పైగా బండి సంజయ్ ను అనరాని మాటలు అంటున్నరు. రేవంత్… మీరు, కేసీఆర్ కలిసి దొంగాట ఆడుతున్నరు. మీ పార్టీలోనే కొందరు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని గెలవాలని భావిస్తే… ఇంకొందరేమో టీఆర్ఎస్ నియంత పాలనకు అడ్డుకట్ట వేయాలనుకుని మథనపడుతున్నరు. రేవంత్ మీద ఎన్నెన్ని ఆరోపణలున్నయి… కాంగ్రెసోళ్లే రేవంత్ ను బ్లాక్ మెయిలర్ అంటున్నారని తెల్వదా? అలాంటి మీరు సంజయ్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది” అంటూ మండిపడ్డారు డీకే అరుణ.
రాజకీయాల్లో కేసీఆర్ లా సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు హర్షించరని అన్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ దుస్థితి ఏంటో కళ్లారా చూశామని చెప్పారు. గల్లీలో, ఢిల్లీలో నాయకత్వం లేదని… ఎవరు బలంగా ఉంటే వాళ్లను తొక్కాలనే స్వభావంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని… ఆ పార్టీ వల్ల ఈ దేశం బాగుపడుతుందనే నమ్మకం ప్రజల్లో పోయిందన్నారు. మోడీ వల్ల దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమనే భావనకు అందరూ వచ్చారని తెలిపారు. అట్టడుగున ఉన్న వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనే కోరుకుంటున్నారని చెప్పారు డీకే అరుణ.