రైతుల బతుకులతో చెలగాడుతూ రాజకీయం చేసే ఘనత కేసీఆర్ కే చెల్లుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ నుండి అదనంగా 6 మెట్రిక్ లక్షల టన్నుల బియ్యం కొనేందుకు సిద్థంగా ఉన్నామని కేంద్రం ఉత్తరం పంపితే.. ఈ విషయాన్ని తమ ఘనతగా కేసీఆర్ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకునేందుకే మంత్రుల బృందం ఢిల్లీకి పోయిందని ఆరోపించారు. సెప్టెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరానికి జవాబుగానే కేంద్రం ప్రత్యుత్తరం పంపిందే తప్ప టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పోయినందుకు కాదని డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మంత్రులు గుర్తించుకుంటే మంచిదని ఆమె అన్నారు.
మెడమీద కత్తిపెడితే ఉత్తరం రాసిచ్చినట్లుగా ఇటీవల చెప్పుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ప్రధాని మెడలు వంచి అదనపు బియ్యం సేకరణకు కేంద్రాన్ని ఒప్పించానని చెప్పుకోవడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. యాసంగి ధాన్యం కొనబోమని టీఆర్ఎస్ నేతలు రైతులను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. యాసంగి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనదో మేం చూస్తామని అన్నారు. యాసంగిలోనూ రా రైస్ కొనడానికి కేంద్రం సిద్దంగా ఉందని.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతిని గుర్తుంచుకోవాలని డీకే అరుణ స్ఫష్టం చేశారు. ఇకనైనా సీఎం కేసీఆర్ రైస్ మిల్లులతో కుమ్మక్కు రాజకీయాలను మానుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని డీకే అరుణ అన్నారు.