టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని విమర్శించారు. శుక్రవారం బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్నపాడు గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కారించిన ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దక్కుతుందన్నారు.
ఆర్డీఎస్ నీళ్ల కోసం రాయలసీమ నాయకులతో కొట్లాడింది తామేనని అన్నారు. ఆర్డీఎస్‌ను అడ్డం పెట్టుకుని తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత ఆర్డీఎస్ ఆధునికీకరణను మరిచిపోయి.. నడిగడ్డ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ నుంచి నడిగడ్డ ప్రాంతానికి 15.9 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని డీకే అరుణ తెలిపారు. ఈ నీటితో నూట నలభై రెండు కిలోమీటర్ల పొడవున 80 వేల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉందని వివరించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుర్చీ వేసుకుని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూడున్నర సంవత్సరాలలో పూర్తి చేస్తామని చెప్పారని, కానీ అటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. ఇటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగడం లేదని ధ్వజమెత్తారు. డీపీఆర్ లేకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కమీషన్ల కోసమే చేపట్టారా.. అని డీకే అరుణ ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల అధికార పాలనలో ఆర్‌డిఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, తుమ్మిళ్లను తూతూమంత్రంగా ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పథకాలకు రూ. వెయ్యి కోట్లు ఇస్తే పాలమూరు సస్యశ్యామలం అయ్యేదని, తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిధులు ఇవ్వకుండా మోకాలడ్డారని మండిపడ్డారు. ఆర్డీఎస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయిస్తారా.. లేదా.. టీఆర్ఎస్ ప్రభుత్వ స్పష్టత ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.