తెలంగాణలో దోచిన లక్షల కోట్ల సొమ్ముతో దేశాన్ని ఏలాలని కేసీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ. బీఆర్ఎస్ ఆవిర్భావంపై మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అసలు జాతీయ పార్టీ పెట్టే అర్హతే లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఏవరైనా పార్టీ పెట్టొచ్చని.. కానీ, కేసీఆర్ కు మాత్రం ఆ అర్హత లేదని విమర్శించారు.
డబ్బులతో గెలవాలనేది కేసీఆర్ ఆలోచనగా చెప్పారు అరున. బీఆర్ఎస్ ను చూసి బీజేపీ భయటపడుతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇది హాస్యాస్పదం అని ఖండించారు. ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని.. దాన్ని చూసి తాము భయపడడం ఏంటని వ్యాఖ్యానించారు. తుపాకీ రాముళ్లను చూసి ఎవరూ భయపడరన్నారు. అయినా.. అవినీతి పరులను చూసి బీజేపీ ఎందుకు భయపడుతుందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తామని.. తెలంగాణలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కానీ అది ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పారు. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో ఏం సాధించారని జాతీయ పార్టీ పెడుతున్నారో చెప్పాలని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు కలలో కూడా ప్రధాని మోడీనే కనిపిస్తున్నారని సెటైర్లు వేశారు.
శుక్రవారం ‘అబ్ కీ బార్.. కిసాన్ కా సర్కార్’ నినాదంతో ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. దేశంలో బలపడతామని, త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ ను భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ ఈ విధంగా స్పందించారు.