- టీఆర్ఎస్-కాంగ్రెస్ కుట్రతోనే హింసాత్మక ఘటనలు
- డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..
అగ్నిపథ్ అల్లర్లు దేశ వ్యాప్తంగా అలజడి రేపాయి. ఆందోళనలు, విధ్వంసకాండతో రాజకీయ చిచ్చు రగులుతోంది. దీంతో టీఆర్ఎస్-బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం పట్ల తాజాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనతో టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుట్రలో భాగమే ఈ అల్లర్లు అంటూ ఆమె ఆరోపించారు. అమాయకులను రెచ్చగొట్టి యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంత్రి హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ విధ్వంసాలకు పీకేతో కలిసి టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
సికింద్రాబాద్ లో పెద్దఎత్తున విధ్వంసం జరుగుతుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్యం సినిమా చూస్తోందా..? అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే వరంగల్ యువకుడు మృతి చెందాడని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకాన్ని టీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
అసలు రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి..? శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? నిఘా విభాగం ఏమి చేస్తున్నట్లు? రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయంటూ డీకే అరుణ నిలదీశారు. సికింద్రాబాద్ అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని ఆమె తెలిపారు.