హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని స్థిరంగా అనుకుంటున్న బీజేపీ ఈ రాష్ట్రంలో అధ్యక్ష పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తర్జనభర్జన పడుతుంది, పార్టీలో సీనియర్లకు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత శక్తిసామర్ధ్యాలు లేకపోవడం, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒకరిద్దరు నేతలకు మంచి ఛరిష్మా ఉన్నప్పటికీ పార్టీకి కొత్తగా వచ్చినవాళ్లను అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని సీనియర్లు ప్రశ్నించే అవకాశం వుండటంతో కేంద్ర నాయకత్వం మీమాంసలో ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ పదవి కాలం ముగుస్తోంది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా, లేక లక్ష్మణ్‌ను మరికొన్నాళ్లు కొనసాగిస్తారా అనేది స్పష్టంకాలేదు. లక్ష్మణ్‌కు మరో అవకాశం ఇవ్వడమైతే కష్టంగానే కనిపిస్తోంది. ప్రజల్లో చరిష్మా ఉండి దూకుడుగా వెళ్లే నేతకు పగ్గాలు ఇస్తే అధికార పీఠం దక్కించుకోవడం కష్టమేమీ కాదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇక్కడే ఒక సమస్య ఉత్పన్నమవుతోంది. తెలంగాణలో కుల రాజకీయాలు ఎక్కువే, ఇప్పటి వరకు రెడ్లు కాంగ్రెస్ వైపు, బీసీలు టీడీపీ వైపు, వెలమ సామాజిక వర్గం టీఆర్ఎస్ వైపు ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో రెడ్లు వర్సెస్ వెలమ ఫైట్ నడుస్తుంది. వెలమ నేతల చేతుల్లో ఉన్న టీఆర్ఎస్‌ను గద్దె దింపాలంటే ఒక బలమైన రెడ్డి సామాజికవర్గం నుంచే అది సాధ్యమవుతుందనేది ఒక విశ్లేషణ. బీజేపీలో ఉన్న వెలమ సామాజిక వర్గం నేతలు చాలా మంది అధ్యక్ష పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ సామాజిక వర్గానికి ఇస్తే టిఆర్ఎస్‌కు లాభం చేసినవాళ్ళు అవుతారనే చర్చ బలంగా ఉంది. వెలమ సామాజికవర్గం నేతలకు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం అనుమనిస్తుంది. అదే రెడ్డి సామాజికవర్గం వాళ్లకు పగ్గాలు అప్పజెప్పితే అధికారానికి దూరం అయిన రెడ్డి సామాజికవర్గం అంతా బీజేపీ వైపు వస్తుందని, ఇన్ని రోజులు కాంగ్రెస్‌తో ఉన్న సామాజికవర్గం బీజేపీ పక్కకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక వాదన బలంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గ నేతల్లో ప్రధానంగా కిషన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డి ఇప్పటికే కేంద్రమంత్రిగా బాధ్యతల్లో వున్నారు. ఆయన పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఇక జితేందర్‌రెడ్డికి ఆర్థిక బలం ఉన్నప్పటికీ ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేత కాదు. తెరచాటు రాజకీయాలు చేయగలరు కానీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత ఇమేజ్ జితేందర్‌రెడ్డికి లేదనేది బీజేపీ పెద్దల అంచనా.
ఇక ఈమధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జేజమ్మకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలమైన సామాజికవర్గం, తెలంగాణ సమాజంలో మాస్ ఇమేజ్, వాగ్ధాటి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సంబంధాలు. అరుణకు రామ్‌మాధవ్ మద్దతు కూడా ఉంది. ఆమెకు పగ్గాలు అప్పజెప్పితే రెడ్డి సామాజికవర్గాన్ని తప్పకుండా ఆకర్షించే అవకాశం ఉంది. దాంతో పాటు కాంగ్రెస్‌లోని చాలామంది నేతలు బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ. అన్నింటికీ మించి కేసీఆర్‌కు ధీటుగా వాగ్దాటి కూడా అరుణమ్మ సొంతం అని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. పార్టీలో మొదటీ నుంచి ఉన్న నేతలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డీకే అరుణకు బీజేపీ సిద్ధాంతాలు తెలియవని, కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారని వారి వాదన. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణకు ఎలా ఇచ్చారో ఇక్కడ అలాగే అరుణకు ఇవ్వాలని ఆమె వర్గం పట్టుబడుతోంది.
మొత్తం మీద తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్న ఢిల్లీ నేతలకు అధ్యక్షుడి ఎన్నిక పెద్ద తలనొప్పిగా మారింది. అన్ని అనుకున్నట్టు జరిగితే తెలంగాణ బీజేపీ పగ్గాలు జేజమ్మ చేతికి దక్కేలా కనిపిస్తోంది.