టీఆర్ఎస్ యాక్టివిస్ట్, న్యాయవాది శ్రీనివాస్ దాడిలో గాయపడ్డ అడ్వకేట్ ప్రసన్నను కలిశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నైజం ఏంటో ఈ ఘటనతో బయటపడిందన్నారు. ప్రసన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
బాధితురాలు ఎన్నోసార్లు శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు డీకే అరుణ. ఆమెపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి పోస్ట్ లు పెట్టి వేధింపులకు పాల్పడినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో ఒక మహిళా అడ్వకేట్ పై దాడి చేయడం దారుణమన్నారు.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. బాధితురాలికి న్యాయం జరగాలని.. తామంతా అండగా ఉంటామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రసన్న కన్నుకు దెబ్బతగిలి కనపడని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భయబ్రాంతులకు గురిచేయడంలో భాగంగానే మహిళా నేత, లాయర్ పై దాడి జరిగిందన్నారు డీకే అరుణ. ఒక ముఖ్యమంత్రే తమ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టడం హేయమైన చర్య అని.. అధికారం ఉంది కదా అని విర్రవీగొద్దని ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరించారు. నియంతగా ప్రవర్తిస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని.. కేసీఆర్.. కాచుకో నిన్ను తరిమి కొట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు డీకే అరుణ.