హైదరాబాద్ వనస్థలిపురం లోని డీమార్ట్ లో దారుణం చోటుచేసుకుంది. మా కొడుకుని కొట్టి చంపేశారంటూ బాధిత యువకుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా కి చెందిన సతీష్ నాయక్ అనే యవకుడు హాయత్ నగర్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావటంతో తల్లిదండ్రులకు చెప్పకుండా స్థానికంగా ఉన్న డీమార్ట్ కు వెళ్ళాడు. రాత్రి 9.30 సమయంలో చాక్లెట్ దొంగతనం చేశాడంటూ సిబ్బంది చెప్తున్నారు. ఈ విషయమై డీమార్ట్ సిబ్బందితో గొడవ చోటుచేసుకుంది. సతీష్ పై సిబ్బంది దాడి చెయ్యటంతో స్పృహ కోల్పోగా… హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయానికే సతీష్ చనిపోయాడు. దీంతో డీమార్ట్ సిబ్బంది కొట్టటం కారణంగానే సతీష్ చనిపోయాడంటూ మృతుని తల్లితండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడ సిబ్బందితో గొడవ జరిగే సమయంలో సతీష్ తో వచ్చిన మరో విద్యార్థులు పరారైయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.