ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాల్లో డీఎన్ఏ టెస్టుల గురించి ఎక్కువగా వింటాం. నిజానికి ఫారెన్ కంట్రీస్ తో పోల్చితే ఇండియాలో డీఎన్ఏ టెస్టులు చేయటం చాలా తక్కువ. ప్రత్యేక సందర్భాలు, కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే డీఎన్ఏ వైపు మొగ్గుచూపుతుంటారు.
అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు పెంపుడు కుక్క నాదంటే నాది అంటూ పెట్టుకున్న పంచాయితీ ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ వరకు వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెంపుడు కుక్క ఎవరిదో తేల్చేందుకు పోలీసులు టెస్ట్ చేయించేందుకు రెడీ అయ్యారు.
సాహెబ్ ఖాన్ అనే వ్యక్తి తమ కుక్క గత కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్తీక్ శివ్‌హారే అనే ఏబీవీపీ నేత సైతం ఇదే తరహా ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కుక్క కోసం వెతకడం ప్రారంభించగా అచూకీ లభించింది. కానీ ఆ కుక్కను ఎవరికి అప్పగించాలి అనేది తలనొప్పిగా మారింది. దీనిపై ఇరువురితో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆ కుక్క తమదంటే తమదేనంటూ వాదించారు. దీనిపై సాహెబ్ ఖాన్ మాట్లాడుతూ మూడు నెలల క్రితం ఆ కుక్కను ఫలానా వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని, దాని పేరు కోకోగా పెట్టుకున్నాని వివరించారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించాడు. మరోవైపు కార్తీక్ కూడా ఈ కుక్క తనదేఅని గట్టిగా చెప్పారు. నాలుగు నెలల కిత్రం ఓ వ్యక్తి వద్ద కొన్నానని, దాని పేరు టైగర్ అని చెప్పారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఆ కుక్క మాత్రం కోకా అని పిలిచినా, టైగర్ అని పిలిచినా స్పందించడం పోలీసులతో పాటు ఇద్దరు యజమానులను ఆశ్యర్యానికి గురిచేసింది.
దీంతో ఈ పంచాయితీ తేల్చేందుకు పోలీసులు కుక్కు డీఎన్ఏ టెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు.