సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను నిర్వహించారు పోలీసులు. బాధితురాలిని చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లి న్యాయమూర్తి సమక్షంలో చూపించారు. నిందితుడు సాదుద్దీన్ ను ఆమె గుర్తుపట్టింది. ఆ తర్వాత సైదాబాద్ లోని జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను బాధితురాలు గుర్తించింది. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.
మరోవైపు నిందితుల డీఎన్‌ఏ సేకరించేందుకు చూస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. ఐదుగురు మైనర్లతో సహా సాదుద్దీన్ డీఎన్‌ఏ సేకరణకు జువెనైల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతిని కోరారు పోలీసులు. కోర్టు కూడా దీనికి ఓకే చెప్పింది. నిందితులు ఇన్నోవా వాహనంలోనే ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించడానికి డీఎన్ఏ టెస్ట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు పోలీసులు. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించే యోచనలో ఉన్నారు.
మే 28న అమ్నేషియా పబ్ లో మైనర్ బాలికను వేధించారు టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు. వారి గోల భరించలేక పబ్ బయటకు వచ్చిన బాలికను అక్కడ ట్రాప్ చేసి తమ కారులోకి ఎక్కించుకున్నారు. తర్వాత ఓ బేకరీ దగ్గరకు వెళ్లారు. దారిలో ఎమ్మెల్యే కుమారుడు సహా ఐదుగురు బాలికను వేధించారు.
బేకరీ నుంచి పెద్దమ్మతల్లి గుడి దగ్గరలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు. అయితే.. అత్యాచార సమయంలో ఎమ్మెల్యే కుమారుడు లేడని పోలీసులు చెప్పారు.