కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలంది. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రమైన చర్యలంటే ఏంటని ప్రశ్నించింది. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా అని అడిగింది. దీనిపై అవినాష్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..చెప్పింది చెప్పినట్లు సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారనే నమ్మకం తమకు లేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం..వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందో తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్ ను సోమవారం సమర్పించాలని ఆదేశించింది. ఇక సోమవారం సీల్డ్ కవర్ లో అవినాష్ వివరాలు, హార్డ్ డిస్క్ ఇవ్వాలని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించగా.. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది కోరారు.
దీంతో అవినాష్ రెడ్డి.. సాక్షా..లేక నిందితుడా.. అని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అవినాష్ రెడ్డికి సీఆర్పీసీ 160 నోటీసు ఇచ్చామని.. అవసరమైతే అవినాష్ ను, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో సోమవారం వరకు అవినాష్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం..అవసరమైతే ఆయన మంగళవారం మరోసారి కోర్టుకు హాజరవుతారని పేర్కొంది.