కష్టపడి సంపాదించుకున్న ఎకరం భూమిలో ట్రాన్స్ కో అధికారులు కరెంట్ టవర్లు కట్టడాన్ని నిరసిస్తూ ఓ రైతు కుటుంబం న్యాయ పోరాటానికి దిగింది. కోర్టు తీర్పులో అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని సంతోషించే లోపే.. మళ్లీ ట్రాన్స్ కో అధికారులు రంగంలోకి దిగడంతో చేసేది లేక ఆ కుటుంబం జగడానికి దిగింది.
ఇక వివరాల్లోకి వెళితే..నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మహమ్మద్ ఇసాక్ తండ్రి మహమ్మద్ జాఫర్ జడ్చేర్ల మండలం బురెడ్డిపల్లి గ్రామ శివారులో 131 సర్వే నంబర్ లో ఒక ఎకరం భూమిని కొన్నారు. గతంలో జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఉన్న ఎకరంలో నుంచి 12 గుంటల భూమి పోవడంతో మిగిలిన 28 గుంటల భూమి మిగిలింది. దీనికి ఈ మధ్యనే ప్లాట్లు గా చేయడానికి నాలా కు దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు నాలా అనుమతి ఇచ్చారు.
అయితే 3388 చదరపు గజాల నాలా అనుమతితో ఉన్న భూమిలో ఎలాంటి సమాచారం లేకుండా 400కెవి హై టెన్షన్ లైన్ ట్రాన్స్ మిషన్ ను దౌర్జన్యంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ విషయం గ్రహించిన బాధితులు హైకోర్టును ఆశ్రయించి.. ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్,ట్రాన్స్ కో అధికారులు ఇంకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చుతూ పిల్ వేశారు.
అయితే కోర్టులో.. అధికారులు తమ వాదనలో ఇలాంటి స్థలంలో ఎలాంటి పనులు చేయడం లేదని తెలిపారు. దీంతో ఈ వివాదం కోర్ట్ లో పెండింగులో ఉంది. మరో వైపు ట్రాన్స్ కో అధికారులు, గుత్తేదారులు కలిసి అక్రమంగా ఈ స్థలంలో టవర్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయం బాధితులకు తెలియడంతో.. వాళ్లు ట్రాన్స్ కో అధికారులతో గొడవకు దిగారు.
ఇక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింప చేశారు. అయితే కోర్టు కేసులో ఉన్న తమ భూమిలో అక్రమంగా కరెంట్ టవర్లను ఎలా కడతారని బాధితులు అడుగుతున్నారు.. ముందుగానే రోడ్డు వైండింగ్ లో భూమిని నష్టపోయిన తమకు మిగిలిన ఈ కొద్దీ భూమిని కూడా ఉండనివ్వారా అని ప్రశ్నిస్తున్నారు.