సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నారంటు టీఆర్ఎస్ నేతలు చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని.. అలా ఏ ప్రభుత్వం చేయలేదని తెల్చి చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజగోపాల్ రెడ్డి. ఈ మేరకు అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సింగరేణికి చెందిన నైనీ బ్లాకును ప్రైవేటు కంపెనీకి అప్పగించి.. సంస్థకు రూ. 20 వేల కోట్ల నష్టం వాటిల్లేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తనకు అన్ని అంశాలపై పట్టుందని సమాధానమిచ్చారు. జీవన్ రెడ్డి స్థాయి, రాజగోపాల్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు తెలుసునని సంచలన వ్యఖ్యలు చేశారు.
కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్టు తనకు ముందుగా తెలియదని.. సభలో జగదీశ్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండించాను తప్పితే.. కేసీఆర్ ఆరోగ్యంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అనవసరంగా తమపై లేనిపోని విమర్శలు చేయడం మంచిదికాదని హెచ్చరించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఏంటో నల్గొండ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.
సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న రాజగోపాల్ రెడ్డి.. ఆ విషయాన్ని నిరూపిస్తానని సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రాన్ని దోచుకుంది ఆంధ్రా కాంట్రాక్టర్లేనని.. ఇప్పుడు దోచుకుంటుందని ఆంధ్రా బడాబాబులేనని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.