నిత్యం పెరుగును తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తుంది. అలాగే పెరుగులో ఉండే విటమిన్ బి2, బి12, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు మన శరీరానికి పోషణను ఇస్తాయి. పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం పెరుగును పలు పదార్థాలతో కలిపి తీసుకోరాదు. అవును.. మరి ఆ పదార్థాలు ఏమిటంటే…
1. ఉల్లిపాయలు:
చాలా మంది పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నేరుగా లేదా అన్నంలో కలిపి తింటుంటారు. అయితే నిజానికి ఇలా తినడం మంచిది కాదు. పెరుగులో ఉల్లిపాయలను కలపరాదు. ఎందుకంటే ఆయుర్వేద ప్రకారం పెరుగు శీతల స్వభావాన్ని కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. అలాగే ఉల్లిపాయలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందువల్ల ఈ రెండు పదార్థాల కాంబినేషన్ మన శరీరానికి మంచిది కాదు. దీని వల్ల స్కిన్ అలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. అలాగే సోరియాసిస్ వంటి సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పెరుగు, ఉల్లిపాయలను కలిపి తినరాదు.
2. మామిడిపండ్లు:
కొందరు మామిడిపండ్ల రసాన్ని పెరుగుతో కలిపి తింటుంటారు. ఇలా కూడా చేయరాదు. ఎందుకంటే ఉల్లిపాయల లాగే మామిడిపండ్లు కూడా శరీరంలో వేడిని పెంచుతాయి. దీని వల్ల చర్మ సమస్యలు వస్తాయి. శరీరంలో విష పదార్థాలు ఏర్పడుతాయి. కనుక ఈ రెండింటి కాంబినేషన్ కూడా మంచిది కాదు.
3. చేపలు:
సాధారణంగా మనకు ప్రోటీన్లు రెండు రకాలుగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఒకటి వృక్ష సంబంధమైన పదార్థాల నుంచి. రెండోది జంతు సంబంధమైన పదార్థాల నుంచి. అయితే ఒకేసారి రెండు వృక్ష సంబంధమైన లేదా రెండు జంతు సంబంధమైన ప్రోటీన్లు కలిగి ఉండే పదార్థాలను తీసుకోరాదు. అంటే.. ఒక వృక్ష సంబంధమైన, ఒక జంతు సంబంధమైన ప్రోటీన్ ఉండే పదార్థాలను కలిపి తినాలి. కానీ రెండు ఒకేలాంటి ప్రోటీన్లు కలిగిన పదార్థాలను తినరాదు. అందువల్ల చేపలు, పెరుగు రెండూ జంతు సంబంధమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. కనుక ఈ రెండింటినీ కలిపి తీసుకోరాదు. చేపలతో లేదా పెరుగుతో వృక్ష సంబంధమైన ప్రోటీన్లను కలిగిన పదార్థాలను తినవచ్చు.
4. పాలు:
పైన తెలిపిన విషయమే దీనికి కూడా వర్తిస్తుంది. పాలు, పెరుగు రెండూ జంతు సంబంధమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. కనుక వీటిని కలిపి తీసుకోరాదు. తీసుకుంటే డయేరియా, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
5. మినపపప్పు:
పెరుగుతో మినపపప్పును కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జీర్ణశక్తిపై ప్రభావం పడుతుంది. అసిడిటీ, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ రెండింటి కాంబినేషన్ కూడా మంచిది కాదు.
6. నూనె పదార్థాలు:
నూనె పదార్థాలతో కలిపి పెరుగు తినరాదు. తింటే జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కనుక నూనె పదార్థాలు, పెరుగును మిక్స్ చేసి తీసుకోకూడదు.