– మినీ వార్ లో కమలం ఫైర్
– బీజేపీకి తిరుగులేదని తేల్చేసిన రిజల్ట్స్!
– యూపీ కా బాద్షా.. యోగి
– అన్నిచోట్లా చతికిలబడ్డ కాంగ్రెస్
– 2024.. ముఖచిత్రం కనపడుతోందా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. దేశంలోనే ఎక్కువ స్థానాలున్న రాష్ట్రం.. మినీ పార్లమెంట్ లా చెప్పుకునే యూపీలో యోగి టీమ్ మరోసారి విజయఢంకా మోగించింది. ప్రతిపక్షాల పేలవమైన గత పాలన ముందు.. ఓ సాధువు సుపరిపాలనే బెస్ట్ అని ప్రజలు నమ్మారు. మరోసారి అధికారం కట్టబెట్టారు. 36 మంత్రిత్వ శాఖలను తన ఆధీనంలోనే ఉంచుకుని ఆయన ఇప్పటిదాకా సాగించిన పాలనే కొనసాగించాలని పట్టం కట్టారు.
ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది బీజేపీ. కమలం పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకునే కాంగ్రెస్, ఇతర పార్టీలను ఎక్కడా దరిదాపుల్లో లేకుండా చేసింది. దెబ్బకు థర్డ్ ఫ్రంట్.. నాలుగో ఫ్రంట్ అంటూ తిరుగుతున్న నేతలకు సైతం దిమ్మతిరిగేలా ఈ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఢీ కొట్టడం.. తమను తామే కష్టాల్లోకి నెట్టుకోవడమేనని గ్రహించి ప్రతిపక్ష నేతలు యూటర్న్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
మోడీ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది.. ఐదు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా గెలవదని ఎన్నికల దాకా ప్రతిపక్ష పార్టీలు తెగ ఊదరగొట్టాయి. ఎక్కడా కూడా స్పష్టమైన మెజార్టీ రాదని చెబుతూ వచ్చాయి. కానీ.. సర్వే సంస్థలు మూడు రాష్ట్రాల్లో బీజేపీ కన్ఫామ్ అని తేల్చాయి.. నాలుగో రాష్ట్రంలో హంగ్ రావొచ్చని చెప్పాయి. కానీ.. అక్కడ కూడా బీజేపీ మంచి ఫలితాన్నే రాబట్టింది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు కనపడినట్లు అయిందని అంటున్నారు విశ్లేషకులు.
యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్ అని చెప్పాయి ప్రతిపక్షాలు. ఈ ఎన్నికల్లో 2024లోనూ బీజేపీ సోయిలో లేకుండా పోతుందని భావించారు. తీరా చూస్తే.. ప్రతిపక్షాల అంచనాలు తప్పాయి. దీంతో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ.. అతి కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బ తీస్తుందో ఇదే చక్కటి ఉదాహరణ అని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.
మోడీ మేనియా ఏమాత్రం తగ్గలేదని తాజా ఫలితాలతో తేలిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ రిజల్ట్స్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మరింత బూస్టప్ లాంటిదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అధికారం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని.. జనం మూడ్ ని సైతం మార్చే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.