తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇక ఆంధ్రా విషయానికొస్తే.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము,ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సవాల్ విసిరితే.. ఆ సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.
తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ కి సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా.. అంటూ లోకేష్, పవన్ ను ఛాలెంజ్ చేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో లోకేష్ ప్రకటించగలరా.. అని నిలదీశారు.
ఇక పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా.. అని ఎద్దేవా చేశారు. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా.. జగన్ గురించి మాట్లాడేది.. అంటూ ఆయన మండిపడ్డారు. ఇక మాకు పొత్తులు అవసరం లేదని, అప్పుడు.. ఇప్పుడు మేం సింగిల్ గానే పోటీ చేస్తాం అని ప్రకటించారు అనిల్ కుమార్ యాదవ్.
కానీ తెలుగు దేశం పార్టీ,జనసేన పార్టీలకు ఆ సత్తా ఉందా.. అని ప్రశ్నించారు. మరో వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసలు గుప్పించారు. ఉద్యోగాల్లో మా హయాంలో వచ్చిన అవకాశాలు గతం కంటే ఎక్కువ అని ప్రకటించిన ఆయన.. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు మొత్తం మా వైపే ఉన్నారని.. వైసీపీ అభ్యర్థులకు ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.