గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అలాగే గ్రీన్ టీలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. కానీ కొందరు భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీని తాగుతారు. కానీ నిజానికి అలా చేయకూడదు.
భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీని తాగడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను మన శరీరం గ్రహించలేదు. మనం తినే ఆహారంలోని పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులతోపాటు విటమిన్లు, మినరల్స్‌ను శరీరం గ్రహించదు. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడుతుంది. అయితే గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి ? అంటే..
అధిక బరువు సమస్య నుంచి బయట పడాలని అనుకునే వారు గ్రీన్ టీని భోజనానికి గంట ముందు లేదా భోజనం చేసిన తరువాత గంటకు తాగవచ్చు. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. జీర్ణప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఇక రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా గ్రీన్ టీ తాగవచ్చు. కాకపోతే ఇందులో కెఫీన్ అధికంగా ఉంటుంది కనుక రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కనీసం 1 గంట ముందు తాగవచ్చు. లేదంటే నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది.
గ్రీన్ టీని పైన సూచించిన సమయాల్లో తాగడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. కానీ భోజనం చేసినప్పుడు తాగితే మాత్రం గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఇక గ్రీన్ టీని అధిక మోతాదులో కూడా సేవించరాదు. అలా చేస్తే బీపీ పెరగడంతోపాటు జీర్ణాశయ సమస్యలు వస్తాయి. కనుక నిత్యం 2 కప్పులకు మించకుండా గ్రీన్ టీని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.