సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవలే ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు కొత్త ఫోన్లను విడుదల చేయగా వాటికి వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. వాటి ధరలు ఎక్కువగా ఉన్నా సరే భారీ సంఖ్యలో యూజర్లు ఆ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే లగ్జరీ ఫోన్లను తయారు చేసే కేవియర్ అనే సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 ప్రొ ఫోన్‌కు పలు మార్పులు, చేర్పులు చేసి కొత్త మోడల్ గా మార్కెట్‌లోకి విడుదల చేసింది. దాని పేరు.. ఐఫోన్ 12 ప్రొ శాండ్స్ ఆఫ్ టైం. సాధారణ ఐఫోన్ 12 ప్రొ ఫోన్ కన్నా ఈ ఫోన్ ధర ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అందుకు కారణం అందులో ఉపయోగించిన లోహాలే..
ఐఫోన్ 12 ప్రొ శాండ్స్ ఆఫ్ టైం ఫోన్‌ను లిమిటెడ్ ఎడిషన్ గా లాంచ్ చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో అమెరికా తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ల బొమ్మలను పోత పోసినట్లు అచ్చు వేవారు. వాటిని అసలు సిసలైన 750 గోల్డ్ ప్రమాణాలు కలిగిన మేలిమి బంగారంతో తీర్చిదిద్దారు. ఇక ఫోన్ కేస్ విషయానికి వస్తే దాన్ని పూర్తిగా టైటానియం లోహంతో రూపొందించారు. దానిపై అమెరికా జాతీయ జెండా ఉంటుంది. 50 నక్షత్రాలు, 7 గీతలను కూడా చూడవచ్చు. మధ్యలో బైడన్, ట్రంప్ బంగారు బొమ్మలను అచ్చు వేశారు.
ఇక ఈ ఫోన్‌కు గాను కేవలం 46 యూనిట్లను మాత్రమే తయారు చేశారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఎంత మంది అధ్యక్షులుగా పనిచేశారో ఆ సంఖ్యలో ఆ ఫోన్ యూనిట్లను తయారు చేశారు. ఇక ఈ ఫోన్ లో ఐఫోన్ 12 ప్రొలో ఉండే ఫీచర్లన్నీ ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఐఫోన్ 12 ప్రొకు చెందిన 512 జీబీ స్టోరేజ్ మోడల్‌ను ఈ విధంగా మార్చినందున యూజర్లకు ఫోన్‌లో 512 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. 6.1 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఓలెడ్ డిస్‌ప్లే, ఫేస్ ఐడీ, వెనుక వైపు 12 మెగాపిక్సల్ కెమెరాలు మూడు, ముందు వైపు ఒక 12 మెగాపిక్సల్ కెమెరా, అధునాతన యాపిల్ ఎ14 ప్రాసెసర్, ఐఓఎస్ 14, 2815 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 5జి.. వంటి సదుపాయాలను అందిస్తున్నారు.
Advertisements
కాగా ఐఫోన్ 12 ప్రొ శాండ్స్ ఆఫ్ టైమ్ కు చెందిన 128 జీబీ మోడల్ ధర ధర 14,900 డాలర్లు (దాదాపుగా రూ.11,04,700)గా ఉంది. ఇదే ఫోన్‌కు చెందిన 512 జీబీ వేరియెంట్ కావాలంటే 15,590 డాలర్లు (దాదాపుగా రూ.11,55,850) చెల్లించాలి. అదే ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ అయితే 18,360 డాలర్లు (దాదాపుగా రూ.13,61,200) చెల్లించాలి. ఆసక్తి ఉన్న వారు https://caviar.global/iphone-12/sands-of-time/ అనే వెబ్‌సైట్‌లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.