భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇటీవలే ఓ టెస్టు సిరీస్ ముగిసిన విషయం విదితమే. ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భారత్.. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలిచి చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్రపంచం మొత్తం టీమిండియాను కీర్తిస్తోంది. అనుభవం లేకపోయినా, సీనియర్ ఆటగాళ్లు లేకున్నా యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారంటూ అనేక మంది మాజీలు, విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. అయితే ఓ గబ్బాలో ముగిసిన టెస్టు సిరీస్ సందర్బంగా టీమిండియా ఇన్‌చార్జి కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్యా రహానే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్‌కు ఓ టీషర్టును బహుమతిగా ఇచ్చాడు. ఇంతకీ ఆ టీషర్టు ఏమిటి ? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ 100 టెస్టులు ఆడిన సందర్భంగా అతనికి ఆ జ్ఞాపకంగా టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే ఆ టీషర్టును అందజేశాడు. అయితే అది టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ. దానిపై ఇండియన్ ప్లేయర్లు ఆటోగ్రాఫ్‌లు చేశారు. ఈ క్రమంలో ఆ జెర్సీని రహానే.. లయాన్‌కు బహుకరించాడు. 100వ టెస్టు ఆడిన లయాన్‌కు ఆ జెర్సీ చిరకాలం గుర్తుగా ఉండిపోతుందని చెబుతూ రహానే ఆ జెర్సీని లయాన్‌కు అందజేశాడు.
కాగా రహానే ఈ విధంగా చేయడంపై అతన్ని దిగ్గజ క్రికెటర్లు అభినందించారు. సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, కామెంటేటర్లు, ఇతర లెజెండరీ క్రికెటర్లు రహానేను మెచ్చుకున్నారు. క్రికెట్ అంటే జెంటిల్మన్ గేమ్ అని, ప్లేయర్లు హుందాగా ఉంటారు అని మరోసారి రహానే రుజువు చేశాడు.