టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ కూడా స్టార్ హీరోలతో చేసాడు. కొన్ని సినిమాలు మంచి హిట్ లు ఇచ్చాయి. మరికొన్ని సినిమాలు షాక్ ఇచ్చినా వెనక్కు తగ్గకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కథ కూడా సిద్దంగా ఉంది. త్వరలోనే షూట్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంది.
ఇదిలా ఉంచితే హరీష్ శంకర్… దర్శకుడు కాక ముందు రైటర్ గా పని చేసాడు. చాన్నాళ్ళ పాటు పూరి జగన్నాథ్ దగ్గర పని చేసాడు. కో డైరెక్టర్ గా పూరి దగ్గర ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత కోన వెంకట్ దగ్గర కూడా పని చేసాడు. అలా డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చింది. అప్పుడే రవితేజా హీరోగా షాక్ అనే సినిమా చేసాడు. ఆ సినిమా షాక్ ఇవ్వడంతో కొన్ని రోజులు సైలెంట్ అయ్యాడు.
ఇక అదే సమయంలో చింతకాయల రవి సినిమా స్టోరీ ఇచ్చాడు. అది వెంకటేష్ కి బాగా నచ్చడంతో యోగేష్ దర్శకత్వంలో ఆ సినిమా చేయగా అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రవితేజా హీరోగా మిరపకాయ్ అనే సినిమా చేసాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చేస్తే అది సినిమా పరిశ్రమలో ఒక సంచలనం కావడంతో హరీష్ శంకర్ కు స్టార్ హీరోల అవకాశాలు వచ్చాయి.