గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ లో తాలీబాన్ రాజ్యం మొదలైన తర్వాతి నుంచి పరిస్థితి అక్కడ చాలా దారుణంగా ఉందనే మాట వాస్తవం. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ దేశంలో రోజు రోజుకి పరిస్థితి దిగజారుతూనే ఉంది. మూర్ఖుల చేతుల్లో ఉన్న ఆఫ్ఘన్ లో ఇప్పుడు శాంతి అనే మాట కూడా వినపడటం లేదు. అంతర్జాతీయ మీడియా కూడా వాస్తవాలను చూపించడం లేదనే విమర్శలు సైతం వినపడుతున్నాయి.
ఇక ఆ దేశంలో ఆకలి కేకలతో చిన్నారులు, వృద్దులు అలమటించిపోతున్నారు. ఎన్నో వనరులు ఉన్న ఆ దేశంలో సామ్రాజ్య వాద శక్తుల అడుగు ఇప్పుడు కడుపు నిండా కూడు లేకుండా చేసింది. భారత్ లాంటి దేశాలు అందించిన సాయం కూడా అక్కడి పేదల కడుపు నింపలేకపోతుంది. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ లో మరో దారుణ పరిస్థితి బయటపడింది. ఆఫ్ఘన్ లో తాలీబాన్ ల పాలన తర్వాత ప్రజల ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా మారింది.
దుర్భర జీవితం నుంచి బయటకు రావడానికి, కన్న బిడ్డల కడుపు నింపడానికి తల్లి తండ్రులు కిడ్నీలు అమ్ముతున్నారు. హేరాత్ ఫ్రావిన్స్ లో కిడ్నీలను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారట తల్లి తండ్రులు. ఆపరేషన్ జరిగిన తర్వాత రెస్ట్ లేకుండానే రెండు మూడు నెలలకే పనుల్లోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత జబ్బు బారిన పడటం జరుగుతూ వస్తుంది అక్కడ.
Advertisements
ఇక ఈ విషయం తెలిసిన కిడ్నీ మాఫియా సరిహద్దుల నుంచి అక్రమంగా వెళ్లి అక్కడ కిడ్నీలను కొనుగోలు చేస్తుంది. అంతర్జాతీయంగా పేరున్న ఆస్పత్రులు కూడా అక్కడికి వెళ్లి కిడ్నీలను కొనుగోలు చేస్తున్నాయనే కథనాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశ రాజధానిగా ఉన్న కాబూల్ లో చాలా ప్రాంతాల్లో మహిళలు కిడ్నీలను విక్రయిస్తున్నారు.