బీజేపీ నేతలు ఇందిరా పార్క్ దీక్షలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్థరహితం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ మండిపడ్దారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఒక్క తెలంగాణలోనే జరిగినట్లు బీజేపీ నేతలు నీతులు చెప్తున్నారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతల సస్పెన్షన్ వివాదాలను దేశం అంతా చూసిందని గుర్తు చేశారు.
బీజేపీ బుల్డోజర్ల భాష వాడుతూ.. తెలంగాణ పల్లెల్లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ద్రోహం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. ఉద్యమ ద్రోహులు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు ఎలా గెలిపిస్తారు అని ప్రశ్నించారు.
బీజేపీకి దమ్ముంటే కేంద్రం నుంచి 2 కోట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసుకురావాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కండకావడంతో సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షాను చూస్తే తెలంగాణ బీజేపీ నేతల లాగులు తడుస్తాయంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ దీక్షలు హైదరాబాద్ లో కాదు.. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఉద్యోగాల కోసం ఢిల్లీలో చేయాలని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ కు పట్టిన గతే..బీజేపీకి పడుతుందని విమర్శించరు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నాయకులకు ఊడిగం చేస్తే.. ఇవ్వాళ టీ-బీజేపీ నాయకులు గుజరాత్ నాయకులకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు సుమన్.