జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పురానా బజార్‌లోని హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు వైద్యులతో సహా ఆరుగురు మృతి చెందారు. తొమ్మిది మందిని అధికారులు రక్షించారు. మృతులను డాక్టర్ వికాస్ హజ్రా మరియు అతని భార్య డాక్టర్ ప్రేమ హజ్రా మరియు ఆసుపత్రిలోని ఇతర ఉద్యోగులుగా గుర్తించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. 2వ అంతస్తులో ఎగసపడిన మంటలు క్రమంగా ఆస్పత్రి మెుత్తం వ్యాపించాయి.
పొగ కారణంగా కొందరికి ఊపిరాడక వారిలో ఆరుగురు మృతి చెందారు. రోగులకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. 2 అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి ఇరువైపులా ఉన్న మొత్తం 9 మందిని రక్షించాయి.
వారందరినీ సమీపంలోని పాటలీపుత్ర నర్సింగ్‌హోమ్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో సరైన భద్రతాపరమైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.