కరోనా వైరస్ తీరని క్షోభను మిగులుస్తోంది. కన్నవారికి పిల్లలను, పిల్లలకు కన్నవారిని లేకుండా చేస్తోంది. తాజాగా విశాఖ కేజీహెచ్ వద్ద హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర వయస్సున్న పాపకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకురాగా.. బెడ్స్ ఖాళీగా లేవంటూ సిబ్బంది చేర్చుకోలేదు. దీంతో ఏంచేయాలో తెలియని పాప తల్లిదండ్రులు.. అక్కడే అంబులెన్స్‌లోనే ఉంచి ఆక్సిజన్ అందించారు. అప్పటికే పరిస్థితి విషమించిన చిన్నారి.. గంటపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కూతురు చనిపోవడంతో.. చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి బాధ అక్కడున్నవారందరిని కలచివేసింది.
తొలుత ఆ చిన్నారి జలుబుతో బాధపడటతో స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అయితే మూడు రోజులు గడిచినా.. పరిస్థితి మెరుగుకాకపోవడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వెంటనే కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తీరా అక్కడికి వెళ్లగా బెడ్స్ ఖాళీగా లేవని చెప్పడంతో గంటసేపు ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ పెట్టినా ఊపిర ఆడక ఆ చిన్నారి కన్నుమూసింది. డాక్టర్లు సమయానికి చికిత్స అందించి ఉంటే.. పాప బతికి ఉండేదని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.