ఈరోజుల్లో చాలా మంది కంటి అద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సులను వాడుతున్నారు. ఎందుకంటే కళ్లకు అద్దాలు పెట్టుకోవడం వల్ల తమ అందం పాడవుతుందని కొందరు భావిస్తే.. మరికొందరు అన్ని సందర్భాల్లో కళ్లకు జోడు పెట్టుకోవడం కుదరక లెన్స్ వాడుతుంటారు.
ఈ మధ్య కాలంలో వాటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అంత సులువు కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు, వాటిని ఉపయోగించే వాళ్లు కళ్లను రుద్దడం వంటివి చేయకూడదు. ఇక ముఖ్యంగా పడుకునేటప్పుడు కచ్చితంగా వాటిని తీసేసి నిద్రపోవాలి. ఎందుకంటే అవి పొరపాటున కంట్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఎవరి కళ్లల్లోనైనా ఒకటికి మించి కాంటాక్ట్ లెన్సులు ఉండవు. ఓ మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు మహిళ గత కొన్ని రోజులుగా అద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తోంది. అయితే, కొన్ని రోజులుగా ఆమె నిద్రకు ముందు వాటిని తొలగిండం మరిచిపోయి.. ఉదయం మరో కొత్త లెన్స్ పెట్టుకునేది.
ఇలా వరుసగా 23 రోజులు చేసింది. చివరకు ఆమెకు కంట్లో నొప్పి రావడం మొదలైంది. భరించలేని నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా… ఆమెను పరీక్షించిన వైద్యులు మహిళ కంట్లో ఏదో ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్ వస్తువు సాయంతో కంట్లో ఉన్నవి తీయగా.. 23 కాంటాక్ట్ లెన్స్‌లు బయటపడ్డాయి. ఇది చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనపై వైద్యురాలు కేథరినా కుర్తీవా మాట్లాడుతూ.. ‘‘ నేను ఎంతో జాగ్రత్తగా ఆ కాంటాక్ట్ లెన్స్‌లను బయటకు తీశాను. అవి మొత్తం 23 ఉన్నాయి. వాటిని కంటి నుంచి బయటకు తీయటానికి మంచి సర్జికల్ వస్తువును వాడాల్సి వచ్చింది. అవి నెల రోజులు కంటి లోపల ఉండిపోవడంతో ఒకదానికి ఒకటి అతుక్కుని ఉన్నాయి’’ అని వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.