మూలాలు మరుగైన మేడారం - Tolivelugu

మూలాలు మరుగైన మేడారం

 -డా॥విశారదన్ మహారాజ్
రాష్ట్ర అధ్యక్షులు,
దళిత్ శక్తి ప్రోగ్రాం-(DSP)

 

“ఒక జాతి భవిష్యత్‌ని అంతం చేయాలంటే దాని గత చరిత్రనంతటిని కనుమరుగు చేస్తే చాలు”. కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడిపై సమరం సాగించిన సమ్మక్క రాణి సారలక్క రాణి, మేడరాజుల చరిత్రని అంతం చేసి వారిని కేవలం దేవతలుగా, దేవుళ్లుగా, ఉత్సవ విగ్రహాలుగా బెల్లం సారా, కల్లు, కోళ్ళు, యాటల్ని సమర్పించుకొనే, ముడుపులు ఇచ్చుకొనే దేవతలుగా మార్చి జాతర చేసుకొనేటట్లు చేసి ఆదివాసుల చరిత్రను పాతరేసారు ఈ మనువాదులు.

700 ఏళ్ళ క్రితమే కరీంనగర్‌ కేంద్రంగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. దానికి రాజు మేడరాజు. ఇతని మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతన్ని మేడారం కేంద్రంగా పరిపాలనాధికారాలు ఒప్పజెప్పాడు. నాటి నుంచి ఆ ప్రాంతానికి పగిడిద్దరాజు రాజయ్యాడు. మేడరాజు-పగిడిద్దరాజులు ప్రతాపరుద్రుడికి కప్పం కడుతూనే వారి వారి ప్రాంతాల్లో ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ పరిపాలన అందిస్తున్నారు. ఆ క్రమంలో వరుసగా ఐదేళ్ళు వర్షాలు పడక అనావృష్టితో కరువు కాటకాలు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. రాజుల ధగ్గర ధనం లేకుండా పోయింది. ఈ సమయంలో కాకతీయ ప్రతాపరుద్రుడు తనకు కప్పం (పన్ను) కట్టమని నిర్దాక్షిణ్యంగా ఈ మేడరాజు-పగిడిద్దరాజులపై వత్తిడి చేశాడు. ప్రతాపరుద్రుడి ఆదేశాలను పగిడిద్దరాజు వ్యతిరేకించాడు. ఎదురు తిరిగాడు – కప్పం కట్టలేమని తెగేసి చెప్పాడు. అప్పుడు ప్రతాపరుద్రుడు ఒక గిరిజనుడు తన మాట వినలేదని పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు.

ఆ వెంటనే యుగంధరుడు అనే కాకతీయ సైన్యాధ్యక్షుడి నాయకత్వంలో సైన్యాన్ని పంపి పగిడిద్దరాజు రాజ్యాన్ని ఆక్రమించమని ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే యుగంధర్‌ తన సైన్యంతో మేడారంలోకి జొరబడ్డాడు. ఆకలి దప్పులతో ఉన్న ఆ ఆదివాసీ సైన్యం, బలమైన కాకతీయ సేనతో ఢీకొనలేక పోయింది. పగిడిద్దరాజుపై యుద్ధం ప్రారంభించాడు. మొదట ‘పగిడిద్ద రాజు’ని తాళ్ళతో కట్టేసి తీసుకువచ్చి నరికి చంపేశారు. ఒక ఆదివాసీ వీరుడు వీరమరణం చెందాడు. ఇక పగిడిద్దరాజు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు కత్తులతో చివరివరకూ పోరాడారు. ఆ తర్వాత వారిని కూడా అతి కిరాతకంగా తలల్ని నరికివేసి చంపారు. ఈ భయానక దృశ్యం చూసి ఓటమి తట్టుకోలేక తన కుటుంబ సభ్యుల మరణం జీర్ణించుకోలేక పగిడిద్దరాజు కొడుకు జంపన్న ఎత్తైన గుట్ట ఎక్కి ‘సంపెంగ’ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒంటరి అయిన పగిడిద్దరాజు భార్య సమ్మక్క ఆడపులి అవతారమెత్తి ఖడ్గం చేతబూని కాకతీయ సైన్యాన్ని దొరికిన వాళ్ళను దొరకినట్లు నరికి చంపేసింది. భయభ్రాంతులకు గురైన కాకతీయ సైన్యం చెల్లాచెదురై ఎటువాళ్ళు అటు పరుగులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆ యుగంధరుడు అనే అగ్రకుల సైన్యాధిపతి బల్లెంతో సమ్మక్కని వెనుక నుంచి వచ్చి వెన్నులో పొడిచాడు. రక్తపు మడుగులో సమ్మక్క కుప్పకూలిపోయి, నెమ్మదిగా నడుచుకుంటూ, సైన్యానికి దొరకకుండా చింతల గుట్ట అడవిలోకి వెళ్ళిపోయింది. ఆమె జాడ ఎవ్వరికీ తెలియదు! ఇక ఆమె ఎప్పటికీ తిరిగిరాలేదు. ఆ పచ్చటి అడవిలో నెత్తురు పారింది. ఎటుచూసినా శవాల గుట్టలుగా కోయ సైన్యం. సహజంగా ఆదివాసులు, మూలవాసులు చనిపోయిన దినం రోజులలో తాగి తందనాలు ఆడి, ఎగిరినట్లుగా మన తల్లి సమ్మక్క, పగిడిద్ద రాజుల మరణాలు కూడా అంతే అయిపోయాయి. వివరాలు పూర్తిగా తెలియకపోయినా ఆనాడు అది ఎంత ప్రభావం చూపిన సంఘటన అయి ఉంటే ఆ మేడారం ప్రాంతానికి లక్షల మంది వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్నారు.

ఇక ఇపుడు మేడారం ఒక రాజకీయ జాతర అయిపోయింది. సమ్మక్కని చంపిన కాకతీయ ప్రతాపరుద్రుడి వారసులైన వారు సమ్మక్క జాతర మాది అంటే మాది అని అంటున్నారు. ఒకేసారి చచ్చినవాడు-చంపినవాడు, ఈ ఇద్దరూ మా జాతర అంటే మా జాతర అంటున్నారు. ఇది ఎట్లా సాధ్యం అని మనం అడగటం లేదు? కాకతీయ రాజులు మా కులం వాళ్ళు అంటూ రెండు బలమైన సామాజిక వర్గాలు పోటీ పడుతున్నాయి. అంటే దీని అర్థం సమ్మక్క సారలమ్మలను మా పూర్వీకులే చంపారని ప్రకటించుకున్నట్లే గదా! మరి అలాంటప్పుడు ఈ మూలవాసులు, ఆదివాసులు అవే అగ్రకుల పార్టీలకు ఓటర్లుగా ఎందుకు మారాలి. అందుకే ఆదివాసులు తమ స్వధర్మం తెలుసుకోవాలి. కాకతీయ రాజుల వారసుల్ని ఓడించటం – తిరిగి తమ రాజ్యాన్ని స్థాపించుకోవటం అదే తమ స్వధర్మ యుద్ధం కావాలి. అప్పుడు మాత్రమే ఈ మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ రాణిల సమర గాధను అక్షరబద్ధం చేసి, దానిని రాతిశాసనాలపై చెక్కించటం సాధ్యమవుతుంది. అది చరిత్రగా ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది. మనం రాసుకునేంత వరకు ఈ పాలకులు మన చరిత్రను శాసనబద్ధం చేయరు. చరిత్రను గెలిచిన వారే రాసుకొంటారు. ఇప్పుడు ఈ చరిత్రను ఓడిపోయిన వారు చెప్పుకుంటున్నారు. ఇది మా వ్రాయబడని చరిత్ర.

 

Share on facebook
Share on twitter
Share on whatsapp