డేటింగ్ యాప్ మోజులో ఓ డాక్టర్ అతి దారుణంగా మోసపోయాడు. ఈసారి వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర రూపాయలు పోగొట్టుకొని…పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు ఆ డాక్టర్ ను చూసి ఖంగు తిన్నారు. ఎందుకంటే… ఆ ప్రబుద్ధుడు ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే డేటింగ్ యాప్ లో మోసపోయి.. రూ.30 లక్షలు ఆర్పించుకున్నాడు. ఆ కేసు ఇంకా పూర్తవ్వకముందే మరోక కేసుతో స్టేషన్ కు వచ్చాడు. అసలేం.. జరిగిందంటే…!!
ఓ డాక్టర్ జిగోలో డేటింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు . ఆ యాప్‌లో డేటింగ్ చేసే యువతుల కోసం వెతికాడు. ఎట్టకేలకు ఓ యువతి యాక్సెప్ట్ చేసింది. ఆమె అమ్మాయని నమ్మి.. అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు.మరోవైపు అమ్మాయి ముసుగులో చాట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. డాక్టర్ నుంచి విడతల వారీగా కోటిన్నర రూపాయలు కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు.
వైద్యుడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతణ్ని చూసి కంగుతిన్నారు. ఇంతకు ముందు ఇలాంటి కేసులోనే మోసపోయి తమ వద్దకు వస్తే కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. విద్యావంతులు.. ఉన్నత వృత్తుల్లో ఉన్న వాళ్లే ఇలా మోసపోతే నిరక్షరాస్యుల పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేశారు.”జిగోలో డేటింగ్ యాప్ ద్వారా రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. మేం డేటింగ్ వెబ్‌సైట్లు, యాప్‌ల మోసాలపై అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాం.
కౌన్సెలింగ్ తర్వాత కూడా అతను జిగోల్ డేటింగ్ యాప్ ద్వారా పలు ఖాతాలకు రూ.80 లక్షలు బదిలీ చేశాడు. కేసు దర్యాప్తులో ఉండగానే మరో రూ.30 లక్షలు బదిలీ చేశాడు. కోటీ పది లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత మళ్లీ మాకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు మొత్తం కోటిన్నర కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది.” అని సైబర్ పోలీసులు తెలిపారు.