నీట్-పీజీ 2021 కౌన్సిలింగ్ నిర్వహణలో జాప్యంపై ఢిల్లీలో రెసిడెంట్ వైద్యులు గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం డాక్టర్లు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసి.. పోలీసులు, వైద్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొనే వరకు వెళ్లారు. అయితే, ఇదే తరహా పరిస్థితులు తలెత్తుతాయి ఏమో అని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, మంగళవారం డాక్టర్లు నిరసనలు శాంతియుతంగా ముగించారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం డాక్టర్లు నిరసనలు తెలిపారు. భారీ సంఖ్యలో డాక్టర్లు నిరసనలో పాల్గొనడంతో సుమారు 100 మంది పోలీసులు అక్కడ మోహరించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పీజీ కౌన్సిలింగ్ను త్వరగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపి వేస్తామని హెచ్చరించారు.
నీట్ పీజీ కౌన్సిలింగ్ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉండటం వలన ఈ విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే నెల 6న తదుపరి విచారణ జరగనుందని, ఈ అంశంపై ప్రభుత్వం తరపున తమ వాదనలు వినిపిస్తామని ఆయన అన్నారు. కౌన్సిలింగ్ త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరతామని చెప్పారు. మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యులు నిరసన విరమించాలని కేంద్ర మంత్రి కోరారు. ఆ వైద్యుల ప్రతినిధుల బృందంతో దిల్లీలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలో వైద్యుల ఇలా నిరసనలు చేయడం మంచిది కాదని లేఖలో వివరించారు. ఈ ఆందోళనలలో పోలీసులు, వైద్యుల మధ్య తలెత్తిన గొడవ సుప్రీం కోర్టుకు చేరింది. నిరసన తెలిపిన వైద్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ల తరపు న్యాయవాది కోరారు.